ఖమ్మం, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సకల గుణాభిరాముడు.. సమాజానికి ఆదర్శప్రాయుడు.. కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. రాజదండం, రాజముద్రిక, పచ్చల పతకం, తామరం, బంగారు ఛత్రం, దుష్టశిక్షణ కోసం రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛరణల మధ్య.. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారికి ధరింపజేయడంతో పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించిన భక్తజనం ‘జయ జయ రామా.. జానకి రామా’ అంటూ స్మరిస్తూ పరవశించిపోయారు. భద్రాచలం పట్టణంలో శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని వైదిక సిబ్బంది గోదావరి నది నుంచి సేకరించిన జలాలతో తీర్థప్రోక్షణ చేయడంతో భక్తులు తరించారు.
శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజు మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. శనివారం జరిగిన మహా పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై రామయ్యకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. తొలుత హెలికాప్టర్ ద్వారా భద్రాచలం చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభం, వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం చేశారు.
నూతన దంపతులైన శ్రీసీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కల్యాణ మండపానికి 10.30 గంటలకు తీసుకుకొచ్చారు. అనంతరం భక్తులు స్వామివారికి చేయించిన స్వర్ణ సింహాసనాన్ని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసి దానిపై శ్రీరాముడికి పట్టాభిషేక తంతు నిర్వహించారు. సరిగ్గా 10 గంటల నుంచి శ్రీరామ మహా పట్టాభిషేకం తంతు ప్రారంభంకాగా.. ఆరాధన తర్వాత వేదస్వస్తితో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. స్వామివారికి పట్టాభిషేకం జరుగుతున్నంత సేపు భక్తులు శ్రీరామ నామాన్ని జపిస్తూ తరించారు. తొలుత శ్రీరామ బంగారు పాదుకలు, అనంతరం రాజనీతిని తెలియజేసే రాజదండం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరామునికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడ లక్ష్మణస్వామికి, తామరం, బంగారు ఛత్రం, దుష్టశిక్షణ కోసం రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు పట్టాభిషిక్తుడైన రామయ్యకు సమర్పించారు. అనంతరం ప్రధాన లాంఛనమైన సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేయగా భక్తజన కోటి కరతాళ ధ్వనులతో జేజేలు పలికారు.
పురాణాల్లో దేవేంద్రుడు రామయ్యకు కానుకగా పంపినట్లు చెప్పే ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తికి, ఆ తర్వాత సీతమ్మ తల్లికి, చివరగా రామభక్త సామ్రాజ్యానికి రారాజు అయిన హనుమంతునికి సమర్పించి అర్చకులు ప్రోక్షణ గావించారు. వేదాశీర్వచనం, అష్టోత్తర శతహారతి 108 ఒత్తులతో వెలిగించి శ్రీరామచంద్ర ప్రభువుకు సమర్పించడంతో మహా పట్టాభిషేకం సుసంపన్నమైంది. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, భద్రాద్రి దేవస్థానం ఈవో దామోదర్‌రావు, ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.