భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం, జూలై 21: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటలకు 44 అడుగలకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన ఉన్న మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి వరద అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాను నాలుగో రోజూ వాన ముసురు వదలలేదు. రోజంతా వర్షం కురిసింది.
పలు మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరద భారీగా చేరుకుంటోంది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద చేరుకుంటోంది. ఇంకొన్ని చోట్ల పంట పొలాలు నీటమునుగుతున్నాయి. కిన్నెరసానిలో ఆరు, తాలిపేరులో 25 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పినపాక మండలంలో చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. చర్ల మండలంలో మూడు గ్రామాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం హెడ్ లాక్‌ల వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 20.2 అడుగులకు చేరుకుంది.
భద్రాద్రి జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు వరద నీరు చేరింది. కిన్నెరసానిలో 16 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలిపెట్టారు. 407 అడుగుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 403.30 అడుగులు నీటిమట్టం ఉంది. సాయంత్రానికి ఆరు గేట్లు ఎత్తివేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో మొత్తం 25 గేట్లను ఎత్తి 92,121 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి వరద ప్రభావం వల్ల అక్కడ ఈతవాగు పొంగడంతో గుంపల్లి చర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో సున్నంబట్టి, కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

భద్రాద్రి జిల్లాలో నాలుగో రోజు ఆదివారం కూడా వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా అశ్వాపురంలో 83 మిల్లీమీటర్లు, మణుగూరులో 74, చర్లలో 68, దుమ్ముగూడెంలో 64, పినపాకలో 54, ఆళ్లపల్లిలో 49, గుండాలలో 33 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 726 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పినపాక మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన పాయం నాగేశ్ తన మిత్రుడితో కలిసి గ్రామ సమీపంలోని పెదవాగు చెక్‌డ్యాం వద్దకు చేపలవేటకు వెళ్లాడు. వాగులో దిగి చేపలు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద పెరగడంతో ఇద్దరు వాగులో గల్లంతయ్యారు. ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకోగా పాయం నాగేశ్ మాత్రం వరద ఉధృతికి గల్లంతయ్యాడు. ఆర్డీవో దామోదర్‌రావు, ఈ బయ్యారం ఎస్సై రాజ్‌కుమార్, ఎంపీడీవో రామకృష్ణలు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఖమ్మం జిల్లాలోనూ వాన ముసురు ఆగలేదు. గడిచిన 24గంటల్లో (శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) జిల్లా వ్యాప్తంగా 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కల్లూరు మండలంలో 27.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకాగా మిగిలిన మండలాల్లో 10 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రెండురోజుల పాటు కూడా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం, గోదావరికి వరద పోటెత్తుతుండడం వల్ల జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా పొంగుతున్న వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అత్యవసరమైతే కంట్రోల్ రూములకు కాల్ చేయాలని చెప్పారు.
కొత్తగూడెం క్రైం, జూలై 21: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించారు. అవసరమైతే 100కు డయల్ చేస్తే సహాయం అందుతుందన్నారు.