ఖమ్మం రూరల్, జూలై 16 : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలతోనే ప్రయోజనం ఉంటుందని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎం.సతీష్ తెలిపారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు, గొల్లపాడు, ముత్తగూడెం రైతు వేదికలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ అవగాహన సదస్సులకు హాజరైన ఏడీఏ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిందన్నారు. ఈ పరిస్థితిని అంచనావేసి అందుకు అనుకూలంగా రైతులు సాగు చేపట్టాలన్నారు. ఎక్కువ మొత్తంలో నీరు అవసరం ఉండే వరి పంటకు బదులు అపరాల పంట సాగు చేసుకోవాలని సూచించారు. మార్కెట్లో అపరాల పంటకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆ దిశగా ఆలోచన చేస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు అన్నారు. అదేవిధంగా నీటి నిల్వలు, నీటి కుంటలు, జి రాంజీ 11 ద్వారా 100 శాతం రాయితీతో నీటి కుంటల ఏర్పాటుపై సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఉమా నగేష్, క్లస్టర్ల ఏఈఓలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.