అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అనే ధోరణిలో హస్తం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నది. సుమారు ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. హామీలను అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆసరా పింఛన్ పెంపు ప్రధానమైనది. దివ్యాంగులకు రూ.6 వేలు, ఇతర పింఛన్‌దారులకు రూ.4 వేల చొప్పున పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీకి ఇంతవరకు అతీగతీ లేదు. ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పింఛన్లే కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,15,204 మంది ఆసరా లబ్ధిదారులు ఉండగా.. రేవంత్‌రెడ్డి పింఛన్ల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు.
– అశ్వారావుపేట, జూలై 1
అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి పాలన ప్రారంభమై 19 నెలలు గడుస్తున్నా ఆసరా పింఛన్ల పెంపు నీటిమీద రాతలు లాగా మిలిగిపోయింది. పింఛన్ల పెంపుపై సీఎం కనీసం పట్టించుకోకపోగా ఆ దశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఏళ్లు గడిచిపోతున్నా పింఛన్లు పెరగకపోవడంతో మోసపోయామని లబ్ధిదారులు మిన్నకుండిపోతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పింఛన్లను భారీగా పెంచింది. దివ్యాంగులకు రూ.4,016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎంఆర్టీ, పైలేరియా, డయాలసిస్ బాధితులకు రూ.2,016 చొప్పున పింఛన్లు పంపిణీ చేసింది. కానీ.. పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అందించిన పింఛన్నే పంపిణీ చేస్తున్నది.
అధికారం కోసం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా హామీలు ఇచ్చింది. అమలుపై కనీస అవగాహన లేకుండానే హామీలు ప్రకటించింది. ఇందులో ఆసరా పింఛన్ల పెంపు హామీ ప్రధానంగా నిలిచింది. దివ్యాంగులకు రూ.6,016, ఇతర వర్గాల లబ్ధిదారులకు రూ.4,016 చొప్పున పింఛన్లు పెంచుతామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ.. నేటికీ పింఛన్ల పెంపు హామీ అమలు కావడం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ ప్రకటన కోసం లబ్ధ్దిదారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తక్షణమే పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1,15,204 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో దివ్యాంగులు 13,288, వృద్ధులు 44,019, వితంతువులు 49,933, చేనేత 17, గీత కార్మికులు 143, ఒంటరి మహిళలు 6,169, బీడీ కార్మికులు 4, పైలేరియా బాధితులు 169, డయాలసిస్ బాధితులు 267, ఇతరులు 1,169 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.25.97 కోట్లు వెచ్చిస్తున్నది.
అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌దారులను మోసం చేసింది. ఎన్నికల సమయంలో పింఛన్లను రెట్టింపు చేస్తామని ప్రకటించి ఇప్పుడు చేతులెత్తేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నయవంచనే.
– మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకాలం పూర్తయినా పింఛన్లను పెంచకపోవడం బాధాకరం. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ను పెంచి ఇందిరమ్మ పాలన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– పున్నమనేని సురేశ్, దివ్యాంగుడు, అశ్వారావుపేట
కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన పింఛనే వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్‌ను పెంచలేదు. ఎప్పుడు పెంచుతుందోనని ఎదురుచూస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెంచకపోతే ప్రజల నమ్మకాన్ని కోల్పోతోంది. పింఛన్ తీసుకునేటప్పుడు కేసీఆరే గుర్తొస్తున్నారు.
– షేక్ మున్నీ, ఒంటరి మహిళ, దమ్మపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తి అయ్యింది. ఇంకెప్పుడు పింఛన్ పెంచుతుంది. మాకు నమ్మకం పోయింది. పింఛన్ పెంచకపోతే ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినట్లే అవుతోంది. ఒకవేళ మోసం చేస్తే ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు గుణపాఠం చెబుతారు.
– పాలకుర్తి లాజర్, లబ్ధిదారుడు, ములకలపల్లి