బొగ్గుట్ట అంటే నల్ల నేలలే కాదు.. అక్కడ పచ్చలహారం వేసుకొన్న కోరగుట్ట తీరొక్క హంగులతో కొత్త పుంతలు తొక్కుతోంది. చిట్టడవిని తలపించేలా ఉన్న గుట్ట పచ్చని శిఖరంలా కనువిందు చేస్తుండగా.. ఉదయం, సాయంత్రం పరిసరాల్లో సంచరించే వివిధ జాతుల పక్షులు.. సీతాకోక చిలుకలు.. అన్నీ ఒకే చోటకు చేర్చినట్లుగా ప్రకృతి వనం చూడముచ్చటగా కనిపిస్తోంది. అటవీ శాఖ రూ.1.74 కోట్ల నిధులతో సుమారు 115 హెక్టార్ల (287 ఎకరాలు) మేర విస్తరించి ఉన్న గుట్టను ఆహ్లాదకరమైన ప్రకృతి వనంగా తీర్చిదిద్దింది. ప్రహరీపై తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలను గీయించారు. వీటికి తోడు గుట్ట చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ఇల్లెందు పట్టణానికే ఐకాన్‌గా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఇదే అతిపెద్ద నేచర్ పార్క్ కావడం మరో విశేషం. పార్క్ రానున్న రోజుల్లో మరో ‘కిన్నెరసాని’గా రూపాంతరం చెందనున్నది. పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనున్నది.
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 19: పక్షుల కిలకిలారావాలు.. రంగు రంగుల సీతాకోకచిలుకల పలకరింపులు.. వేకువ జామున గుట్టను తాకుతున్న మేఘాలు.. చెట్ల కొమ్మల రెపరెపలు.. ఆహ్లాదం.. ఆనందం.. అన్నీ ఒకేచోట అనుభూతి చెందే ప్రదేశం ఇల్లెందు పట్టణ శివారులోని కోరగుట్ట(ఊరగుట్ట) నేచర్ పార్క్. రాష్ట్ర అటవీశాఖ రూ.1.74 కోట్లతో సుమారు 115 హెక్టార్ల (287 ఎకరాలు) మేర విస్తరించి ఉన్న గుట్టను ప్రకృతి వనంగా తీర్చిదిద్దింది. గుట్ట చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. పార్క్ ఇప్పుడు ఇల్లెందు పట్టణానికే ఐకాన్‌గా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఇదే అతిపెద్ద నేచర్ పార్క్ ఇదే కావడం మరో విశేషం. ఇటీవల పార్క్‌ను ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు.
గుట్టపై సహజంగా పెరిగే మొక్కలు, చెట్లతో పాటు అటవీశాఖ హైదరాబాద్ నుంచి సుమారు 6 వేల మొక్కలు తెప్పించి పార్క్‌లో నాటించనన్నది. వీటిలో అంతరించిపోతున్న అరుదైన మొక్కలు ఉండడం విశేషం. ప్రస్తుతం పట్టణంతోపాటు సమీప గ్రామాలకు చెందిన వాకర్స్, యువత ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి వ్యాయామం చేస్తున్నారు. అటవీశాఖ పార్క్‌కు వచ్చే పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10కే కేవలం టికెట్టు నిర్ణయించింది. పార్క్ ఉదయం 9:00 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచే ఉంటుంది.
అటవీశాఖ పార్క్ ప్రహరీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ప్రహరీపై తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలను చిత్రకారులతో గీయించింది. పార్క్ రానున్న రోజుల్లో మరోసారి ‘కిన్నెరసాని’గా రూపాంతరం చెందనున్నది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనున్నది. పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగనున్నది.
పార్కులో రెండు మూడు చోట్ల ఓపెన్ జిమ్‌లు, విశ్రాంతి తీసుకునేందుకు మూడు సీటర్స్ సిమెంట్ సోఫాలు, పగోడాలు అందుబాటులోకి రానున్నాయి. పార్క్ అంతటా సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగనున్నది. పార్క్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నాలుగు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ప్రజలు శుభాకార్యాలు నిర్వహించుకునేందుకు అటశాఖ కల్యాణ మండపం నిర్మించనున్నది. వన భోజనాల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించనున్నది. చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్క్‌లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కొన్నిరకాల వన్యప్రాణులనూ వదిలిపెట్టనున్నది. పురుషుల కోసం మూడు, స్త్రీల కోసం మూడు బాత్ రూంలు నిర్మించనున్నది. యువతీ యువకులు యోగా సాధన చేసేందుకు ప్రత్యేకమైన స్థలం కేటాయించనున్నది. పార్క్‌లోని 4-5 ఎకరాల్లోని చెరువులో త్వరలో బోటు షికారు సౌకర్యం ఏర్పాటు చేయనున్నది.
ఇల్లెందు పట్టణ శివారులో ప్రకృతి అందాలకు నిలయంగా నేచర్ పార్క్‌ను తీర్చిదిద్దాం. ఈనెల 6న ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పార్క్‌ను ప్రారంభించారు. త్వరలో పార్క్‌లో పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం కల్పించనున్నాం. ఇల్లెందు పట్టణవాసులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు పార్క్‌కు వచ్చి ఆహ్లాదంగా గడపవచ్చు. పార్క్‌ను సందర్శించేంకు నామమాత్రపు టికెట్ ధరలు అమలు చేస్తున్నాం.