బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీల బంద్ సన్నాహక సమావేశాన్ని ఖమ్మంలో బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ శుక్రవారం నిర్వహించారు. ముందుగా, బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మంలో మయూరిసెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జనాభాలో తాము ఎంత శాతం ఉన్నామో రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తమకు అంతశాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో తమకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బంద్‌లో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం సహా వివిధ పార్టీల నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, వై.విక్రమ్, మేకల శ్రీను, కూరపాటి వెంకటేశ్వర్లు, రాఘవులు, అశోక్, శ్రీనివాస్, వీరభద్రం, బీసీ నాయకులు మేకల సుగుణా రావు, బొమ్మా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.