‘నమ్మి ఓటేస్తే నమ్మకద్రోహం చేస్తారా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బడుగుజీవులు. తాము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని, వాటికి చట్టబద్ధత కల్పిస్తామని, 42 శాతం రిజర్వేషన్లు తెచ్చి అమలుచేస్తామని హామీలమీద హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మోసానికి పాల్పడుతోందని ప్రశ్నించారు. కులగణనను సమగ్రంగా నిర్వహించకపోవడం, బీసీల జనాభాను తగ్గించిచూపడం, రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రంతో మెలికపెట్టడం వంటివన్నీ రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకు చేస్తున్న కుట్రలుగానే భావిస్తున్నామని అన్నారు.
దేశ జనాభా, ఓటర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో బీసీల జనాభా మాత్రమే ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. మరి ఉన్నట్టుండి ఓసీల జనాభా ఎలా పెరిగిందో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అత్యంత లోపభూయిష్టంగా ఉందనేందుకు బీసీల జనాభా తగ్గుదలే సుష్పష్టమైన కారణమని తేల్చిచెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ఎందుకు అమలుచేయరో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మేము ఓట్లు వేసి గెలిపించాక మీరెందుకు మీ హామీని నెరవేర్చరు?’ ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేసిన నమ్మక ద్రోహాన్ని ముమ్మాటికీ సహించబోమని, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించేదాకా రేవంత్ ప్రభుత్వాన్ని వదలబోమని స్పష్టం చేశారు.
-నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 9
గత కేసీఆర్ ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేనే వంద శాతం కరెక్టు. కుల గణన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపడం దారుణం. అసంపూర్తి సర్వేను ప్రభుత్వం అమోదిస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్వే లెక్కల కంటే కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. జనాభా పెరిగితే బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం తగ్గించి చూపుతున్నది. కులాలవారీగా జనాభాను ప్రకటించాలి.
-వీరబోయిన వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకుడు, యాదవ సంఘం నాయకుడు, అన్నపురెడ్డిపల్లి
కుల గణనలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుటుంబాలను మాయం చేసింది. ఉద్యోగులు సర్వే చేసినా ఆన్లైన్లో పొందుపరచకుండా అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. సర్వే వల్ల బీసీలకు రాజకీయ రంగాలతోపాటు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డాం. 60 శాతం పైగా ఉన్న బీసీ కులాలను 47 శాతంగా చూపించడం దారుణం. ఇలాంటి సర్వేల వల్ల బీసీ సామాజిక వర్గానికి తీరని నష్టం జరుగుతుంది.
– బంధం శ్రీనివాసరావు, మధిర మార్కెట్ మాజీ చైర్మన్
బీసీ జనాభా లెక్కల వ్యవహారం పకడ్బందీగా ఉండాల్సిందే. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీల కుల గణన లెక్కలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ప్రస్తుతం ప్రజలను మభ్య పెట్టేందుకే బీసీ జనాభా లెక్కలు తీశారు. ఇంతమంది బీసీలను మోసం చేయడం సరికాదు.
– చెక్కిలాల మోహన్రావు, మాజీ జడ్పీటీసీ
బీసీల కుల గణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి మాదిరిగా ఉంది. కుల గణనపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. భవిష్యత్లో ప్రభుత్వం బీసీ సంఘాల సత్తా చవి చూడాల్సి వస్తుంది. రోజురోజుకూ ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేలా ఉంది.
– చెక్కిలాల లక్ష్మణరావు, ఏఎంసీ మాజీ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. చేతల్లో ఏమీ కనిపించడం లేదు. కొన్నేళ్ల నుంచి బీసీ సంఘాలు ఐక్య ఉద్యమాలు చేసినా ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికే రిజర్వేషన్ల మాట ఎత్తాయి. ఎన్నికలయ్యాక తూతూ మంత్రంగా తప్పుల తడకగా లెక్కలు వేసి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
– వర్థబోయిన నాగేశ్వరరావు, యాదవ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి
స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే చేపట్టింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని అసంపూర్తిగా సర్వే చేసి చేతులు దులుపుకుంది. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే 100 శాతం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 97 శాతమే పూర్తి చేసింది. బీసీలను తగ్గించి.. ఓసీలను పెంచి చూపించారు. కాంగ్రెస్ పార్టీలోనే సర్వేపై నమ్మకం లేదు. కుల గణన సర్వేతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ దగా చేసింది.
-జుజ్జూరపు వెంకన్నబాబు,బీఆర్ఎస్ మండల కార్యదర్శి, అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన సర్వే అంతా తప్పుల తడక. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో బీసీల జనాభా గణనీయంగా తగ్గింది. తమ ప్రభుత్వం రాగానే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా బీసీ జనాభా శాతాన్ని తగ్గించింది. దీనిపై బీసీలంతా ఐక్య పోరాటాలు చేయాల్సిందే.
-కుంటా లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్
పదేళ్ల క్రితం కంటే ఇప్పుడు బీసీల జనాభా ఎలా తగ్గుతుంది. బీసీల్లోని అన్ని కులాలను సర్వే చేయలేదు. ప్రభుత్వం తప్పుడు నివేదికను ప్రజల ముందుంచింది. కుల గణన సర్వేను పూర్తి చేయకుండానే గణాంకాలు విడుదల చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థల్లో మెప్పు పొందడానికే హడావిడిగా నివేదికను ప్రచురించారు. బీసీలకు జరిగిన అన్యాయంపై స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతాం.
-గడ్డం వెంకటేశ్వర్లు గౌడ్, బీఆర్ఎస్ మండల కార్యదర్శి, ముదిగొండ
రెండు నెలలపాటు చేపట్టిన కుల గణన సర్వే వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాస్తవంగా గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతానికంటే ఎక్కువగా ఉంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం 48 శాతంగానే నమోదైంది. అదీకాక ఓసీల జనాభా ఒక్కసారిగా ఎలా పెరిగింది. మళ్లీ సర్వే చేయాల్సిందే.
-కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్