ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు గురువారం అంబరాన్నంటాయి. వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆడబిడ్డలు ఎంతో ఓర్పుగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’, ‘గౌరమ్మతల్లీ పోయిరావమ్మా..’ అంటూ వీడ్కోలు పలికారు.
బతుకమ్మలన్నింటినీ గంగమ్మ తల్లి ఒడికి వైభవంగా సాగనంపారు. ఖమ్మం పాండురంగాపురంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాటలకు స్టెప్పులేస్తూ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. సద్దుల బతుకమ్మ సంబురాలను తిలకించేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
– నమస్తే నెట్వర్క్