హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది. 2019 నుంచి 2024 వరకు సర్పంచులుగా పనిచేసిన తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, నాయకులు కేశబోయిన మల్లయ్యయాదవ్, సముద్రాల రమేశ్, హనుమకొండ బోట్ల రవి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ‘ఉమెన్ లెడ్ మొబిలిటీ లైవ్లీవుడ్స్ పైలెట్’ కార్యక్రమం కోసం ప్రైవేట్ సంస్థలతో ఎంవోయూలు జరిగాయి. శుక్రవారం ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో డీజీ చారుసిన్హా, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా బలహీనవర్గాలకు చెందిన మహిళలకు టూ-వీలర్, త్రీ-వీలర్, ఫోర్-వీలర్ డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ పొందిన మహిళలకు ఉద్యోగం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.