హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న సార్వత్రిక సమ్మె జరుగనుంది. దీనికి మద్దుతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)పిలుపునిచ్చింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఎస్కేఎం తెలంగాణ రాష్ట్ర నేతలు పశ్యపద్మ, టీ సాగర్ మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ గ్రామాల్లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
అమెరికా ముందు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు. విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ రద్దవుతుందని, మోటర్లకు మీటర్లను ఏర్పాటు చేస్తారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వీ ప్రభాకర్, జకుల వెంకటయ్య, ఆర్ వెంకట్రాములు, మండల వెంకన్న, కే కాంతయ్య , మూడ్ శోభన్, డీజీ నరేంద్రప్రసాద్, బీ రాము తదితరులు పాల్గొన్నారు.