‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి.. తెల్ల చంద్రుడిలో వెన్నులలే తీసుకొచ్చి..’ అంటూ ఆడబిడ్డలంతా ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక పండుగకు వన్నె తెచ్చారు. ప్రకృతిని పూజించే పూల పండుగ ఉమ్మడి జిల్లాలో ఐదో రోజు ఆదివారమూ ఘనంగా కొనసాగింది. ఐదో రోజు అట్ల బతుకమ్మతో ఆడబిడ్డలందరూ వాడవాడలా సందడి చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ‘అందాలా బతుకమ్మా.. రావే..’ అంటూ ఆడబిడ్డలు కోలాట నృత్యాలు ప్రదర్శించారు. అలాగే, కలెక్టర్ ఆదేశాల మేరకు టీఎన్జీవోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్లోనూ బతుకమ్మ వేడుకలు జరిగాయి. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.