ఎంగిలిపూలతో షురువైన బతుకమ్మ సంబురాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది రోజులపాటు సంబురంగా సాగాయి. ఇళ్లలో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు.. వాటిపై గౌరమ్మలను ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజలు చేశారు. సాయంత్రం వేళ బతుకమ్మలతో ఆలయాలు, పొలం గట్ల పరిసరాలకు చేరుకుని ఆడిపాడి సందడి చేశారు.
గురువారం చివరి రోజు సద్దుల బతుకమ్మ కోసం తీరొక్క పూలను సేకరించారు. ఇంటిల్లిపాదీ వాటికి రంగులద్ది పండుగకు మరింత శోభను తీసుకొచ్చారు. పోటీపడి బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు.. తొలుత తమ ఇళ్లలో పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ నూతన వస్ర్తాలు ధరించి మేళతాళాల నడుమ నిమజ్జన ప్రాంతాలకు చేరుకున్నారు. బతుకమ్మలను చుట్టూ పెట్టి తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు వేస్తూ మురిసిపోయారు.
అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుని ఇళ్లకు బయలుదేరారు. వెంట తీసుకెళ్లిన నైవేద్యాన్ని పలువురికి పంచిపెట్టి పండుగ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. కాగా, గురువారం అర్ధరాత్రి వరకూ సద్దుల బతుకమ్మతో ఆడబిడ్డలు సందడి చేశారు. కొత్తగూడెంలో ముర్రేడు, గోధుమవాగు; ఖమ్మంలో మున్నేరు వాగుల వద్ద ఏర్పాటు చేసిన ఘాట్లలో నిమజ్జనం చేసి బతుకమ్మలను సాగనంపారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం, అక్టోబర్ 10