ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 1: ప్రపంచంలోనే అరుదైన పూలపండుగ బుధవారం నుంచి ఇంటింటా సందడి చేయనుంది. ‘ఇంతి’ంతై విశ్వవాప్తమై సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న బతుకమ్మ ఆగమనంతో ఇంటిల్లిపాదికీ సంబురమే. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండుగలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తిశ్రద్ధలతో మమేకమవుతారు. తొమ్మిది రోజులు జగన్మాత స్వరూపులైన మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి సహా వివిధ అవతారాలను విభిన్న రీతుల్లో పూజిస్తారు. శతాబ్దాల తరబడి జరుపుకుంటున్న ఈ పండుగ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కొత్త సొబగును సంతరించుకుంది. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి బతుకమ్మ అధికారిక పండుగగా కొనసాగుతోంది. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటారు.
హైందవ సంప్రదాయంలో కల్యాణం, గృహప్రవేశం, వినాయకచవితి, దీపావళి, వ్రతాలు నిర్వహించేటప్పుడు పసుపుతో గౌరీమాతను తయారు చేసి పూజిస్తారు. బతుకమ్మను పేర్చేటప్పుడు కూడా గౌరీమాతను తయారు చేసి పెడతారు. బతికించి, కోరికలు తీర్చే గౌరీమాతను బతుకమ్మగా మహిళలు పూజిస్తారు. పెళ్లి వయసు గల యువతులు మంచి భర్త రావాలని, వివాహమైన స్త్రీలు తన భర్త వందేళ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని, తన పసుపు కుంకుమలు కాపాడాలని బతుకమ్మను పూజించడం ఈ పండుగ విశిష్టత.
బతుకమ్మ పండుగలో ఆటపాటలు ప్రత్యేకం. అలంకరణల్లో విశిష్టత కనిపిస్తుంది. బతుకమ్మను పేర్చేటప్పుడు రెండు, ఐదు, ఏడు రకాల పూలు వినియోగిస్తారు. ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తారు. చెరువులో నిమజ్జనం చేసి వివిధ రకాలైన పిండివంటలను ఆరగిస్తారు. చెరువు మట్టిని తెచ్చి ముత్తయిదువులు వాయినాలు ఇచ్చుకుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం పితృ అమావాస్యతో మొదలయ్యే ఈ వేడుకలు ఈ నెల10 వరకు జరుగనున్నాయి.
బుధవారం నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు అటుకుల బతుకమ్మలో సప్పడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం వినియోగిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మలో ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం వినియో గిస్తారు. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మలో పాలు, బెల్లం, నానేసిన బియ్యంతో ప్రసాదం వినియోగిస్తారు. ఐదో రోజున అట్ల బతుకమ్మను బియ్యం నానబెట్టి దంచిన పిండితో తయారుచేసిన అట్ల (దోశలు) ప్రసాదం వినియోగిస్తారు. ఆరో రోజున అలిగిన బతుకమ్మలో బతుకమ్మ అలిగినట్లుగా భావించి ఆ రోజు బతుకమ్మలు పేర్చరు. ఆడరు. ఏడో రోజున వేపకాయల బతుకమ్మలో సకినాలు చేసే పిండితో వేప కాయలంత పరిమాణంలో ముద్దలుగా చేసి నూనెలో వేయించిన వంటకం ప్రసాదంగా వినియోగిస్తారు. ఎనిమిదో రోజున వెన్నముద్దల బతుకమ్మలో నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారుచేసిన ఫలహారం వినియోగిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మలో ఐదు రకాల సద్దుల అయిన ఫలహారం, పెరుగన్నం, చింతపండు పులిహోర, సద్ది, కొబ్బరి తురుము, నువ్వుల పొడి కలిపిన సద్ది ఫలహారం వినియోగిస్తారు. ఇలా తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆడిపాడిన మహిళలు సద్దుల బతుకమ్మ రోజున అంగరంగ వైభవంగా బతుకమ్మల సామూహిక నిమజ్జనోత్సవాన్ని జరుపుతారు. బతుమ్మకను సాదరంగా సాగనంపుతారు.
మంగళవారం నుంచి పల్లెపల్లెనా పూలసింగిడి పులకించనుంది. పూలను కొలిచే పుణ్యమైన బతుకు పండుగలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆడబిడ్డలు తమ తల్లిగారిళ్లకు చేరుకున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు సందడిగా కన్పిస్తున్నాయి. పట్టణాలు బతుకమ్మ బుట్టలు, వివిధ రకాల పూల విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలి వర్షాలకు జలాశయాలకు నీళ్లు చేరడంతో బతుకమ్మ ఘాట్లు కూడా సిద్ధమయ్యాయి. గ్రామాల్లోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు జలకళతో ఉన్నాయి. పూలపండుగ కోసం తీరొక్క పూలను సేకరించే పనిలో యువతులు, బాలికల సోదరులు నిమగ్నమయ్యారు.
బతుకమ్మ పుట్టపై గ్రామీణులు పాడుకునే పాటల్లో పలు అంశాలతోపాటు చారిత్రక నేపథ్యం గల కథలూ ఉన్నాయి. క్రీస్తుశకం 300 ఏళ్ల కాలంలో దక్షిణ భారతదేశాన్ని చాళుక్యులు పరిపాలించేవారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరి వంశస్తుడైన ధర్మంగధుడు అనే రాజుకు సంతానం లేదు. చాలా ఏళ్ల తరువాత జన్మించిన ఏకైక కుమార్తెకు లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆమె అనేక వ్యాధులతో బాధపడుతూ గండాలను ఎదుర్కొంటుంది. దానికి నివారణగా శక్తిస్వరూపిణి అయిన గౌరీదేవిని ప్రకృతిలో సహజంగా లభించే పూలతో పూజించాలని ఆస్థాన పండితులు చెబుతారు.
భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అంటూ దీవించారట. చోళ వంశానికి చెందిన ధర్మాంగధుడు, సత్యవతి అనే రాజ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. వారు చేసిన నోములతో వందమంది కొడుకులు పుట్టినా, వారంతా యుద్ధంలో చనిపోతారు. దీంతో విషాదాన్ని తట్టుకోలేక రాజు దంపతులు అడవికి వెళ్లి తపస్సు చేస్తారు. అప్పుడు ప్రత్యక్షమైన లక్ష్మీదేవి.. వారి బిడ్డగా పుడతానని వరమిస్తుంది. ఈ మేరకు పుట్టిన బిడ్డ కలకాలం బతకాలని రుషులు ‘బతుకమ్మ’ అని నామకరణం చేస్తారు. అప్పటి నుంచి చోళ రాజ్యంలో ‘బతుకమ్మ’ సంక్షేమం కోసం పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారిందని, ‘బతుకమ్మ’ అనే దీవెనే బతుకమ్మగా వెలుగొందిందని పురాణోక్తి.
పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబంలో ఏడుతరాల తరువాత లక్ష్మీదేవి కటాక్షంతో ఆడబిడ్డ పుడుతుంది. దీంతో ఆ కుటుంబం కాలక్రమేణా ఐశ్వర్యమంతమవుతుంది. వివాహ వయసు వచ్చిన ఆడబిడ్డకు పెళ్లి చేసి మెట్టినింటికి పంపుతారు. ఆమె పుట్టినింటి గడప దాటి వెళ్లిపోగానే ఆమె కుటుంబం ప్రకృతి వైపరీత్యాలకు ఉన్నదంతా పోయి మళ్లీ పేద కుటుంబమవుతుంది. పేదలుగా మారిన తల్లిదండ్రులు, అన్నదమ్ములను ఆదుకోవడానికి ఆ ఆడబిడ్డ మళ్లీ బతుకమ్మ పేరుతో ఏటా పుట్టినింటికి వచ్చి గౌరీమాత పూజ చేస్తుంది. దీంతో మళ్లీ ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అందుకే ఇప్పటికీ వివాహమైన మహిళలు పుట్టింటికి వచ్చి బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఆడబిడ్డను మహాలక్ష్మిగా, గౌరీమాతగా కుటుంబం భావించడం తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయింది.