భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం, అక్టోబర్ 2: ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ బతుకమ్మ గీతాలు మార్మోగాయి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవారం తొలిరోజు పూలపండుగ సంబురాలు మొదలయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మలను అందంగా అలంకరించుకొని వచ్చిన మహిళామణులు.. వాటిని ఒకచోట చేర్చారు.
చప్పట్లు, నృత్యాలు, బతుకమ్మ గీతాలతో ఆడిపాడి సందడి చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బతుకమ్మ పండుగను అధికారికంగా జరపడంతో ఈ సంబురాలకు మరింత ఆదరణ పెరిగింది. అదే సంప్రదాయంతో ఉమ్మడి జిల్లాలోని మహిళలందరూ బతుకమ్మ సంబురాలను పండుగలా జరుపుతున్నారు. తొలి రోజు నాటి ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఊరూవాడల్లో అంబురాన్నంటాయి. రాత్రి వరకూ బతుకమ్మ ఆడిన మహిళలు.. అనంతరం స్థానిక చెరువులు, కుంటలు, వాగుల్లో వాటిని నిమజ్ఞనం చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ముర్రేడు వాగు వద్ద ఆడబిడ్డలు ఆడిన బతుకమ్మ ఆటలు ఆకట్టుకున్నాయి.
తొమ్మిది రోజులపాటు సాగే ఆటపాటల బతుకమ్మ పూలపండుగ బుధవారం ఎంగిలిపూలతో ఆరంభమైంది. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో కేఎంసీ, మెప్మా మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘం సభ్యులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మహిళా ఉద్యోగులు, నగర మహిళలు కలిసి కేఎంసీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గరికి చేర్చి.. ప్రకృతితో మమేకమయ్యేలా చేసే పండుగ బతుకమ్మ అని గుర్తుచేశారు. తెలంగాణ సంసృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు.
డీడబ్ల్యూవో రాంగోపాల్‌రెడ్డి, కేఎంసీ సహాయ కమిషనర్ సంపత్‌కుమార్, మహిళా అధికారులు, ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో జరిగిన వేడుకులకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, మాటేటి కిరణ్‌కుమార్, భారతి, నిరోషా, బిచ్చాల తిరుమలరావు, కొల్లు పద్మ, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం 51వ డివిజన్లో హనుమాన్ గుడి వద్ద కార్పొరేటర్ శీలంశెట్టి రమ ఆధ్వర్యంలోనూ పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.