ఇల్లెందు రూరల్, నవంబర్ 10: కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నదని ఇల్లెందు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. గురువారం రాత్రి మండలంలోని సుదిమళ్లలోని హరిప్రియ నివాసంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణకు గులాబీ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు డబ్బులకు ప్రలోభాలు పెడుతూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు గాలం వేస్తున్నారన్నారు. వీరి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇల్లెందులో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు మోసపూరిత విధానాలను ప్రారంభించి వారి గోతులను వారే తవ్వుకుంటున్నారన్నారు. చేసిన అభివృద్ధి పనులను చూసిన ప్రజలే ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపిస్తారన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ బాగోతం బయటపడుతుందన్నారు. ఎన్నికల సమరంలో పోరాడి గెలవాలే కాని ఇలాంటి కుయుక్తులు, కుతంత్రాలు, డబ్బు ప్రలోభాలకు గురిచేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, కోఆప్షన్ సభ్యుడు ఘాజీ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, నవంబర్ 10: డబ్బుతో ప్రజాభిమానాన్ని కొనలేరని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ సూచించారు. గురువారం రాత్రి మండలంలోని సత్యనారాయణపురం, 1, 20, 22వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలోని కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడం దురదృష్టకరమని, తిన్నింటి వాసాలు లెక్కపెట్టొద్దన్నారు. ఆదరించిన బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్లో చేరితే అక్కడ గౌరవంగా చూస్తారా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, కాపాడుకుంటూ ఉన్న నాయకులకే టికెట్ దిక్కులేదన్నారు. దక్కలేదంటే దీనికంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి బీఫాం ఇచ్చారని ఆయన విశ్వాసాన్ని మనం గెలుపించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్లోకి చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులను తానే దత్తత తీసుకుంటున్నారన్నారు. ఇక నుంచి వార్డు అభివృద్ధి తన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా, కౌన్సిలర్లు కటకం పద్మావతి, రజిత, టీబీజీకేఎస్ నాయకుడు రంగనాథ్, నాయకులు భద్రం, మేకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.