కొణిజర్ల, ఆగస్టు 13: తమది ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. గోపవరం సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో బుధవారం ఆమె మాట్లాడారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపోయేంత యూరియా పంపిణీ చేశామని అన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు వ్యవసాయ పనులు వదిలి యూరియా కోసం రోడ్డెకాల్సి వస్తోందని విమర్శించారు. రైతులకు తగినంత యూరియా సరఫరా చేయకుంటే రైతుల పక్షాన ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కిలారు మాధవరావు, రైతులు పాల్గొన్నారు.