ఖమ్మం రూరల్, మే 11 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్‌కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవనంలో సీపీఎం ఏదులాపురం మండల కమిటీ సమావేశం మండల నాయకుడు నందిగామ కృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బండి రమేశ్ మాట్లాడుతూ… చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే శిక్షించకపోవడం దుర్మార్గమన్నారు. గతంలో కూడా బండి సాయి భగీరథ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడడం, భౌతిక దాడులకు పాల్పడడం్ అందరికీ తెలిసిందేనన్నారు. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేయడమే కాకుండా కేసును తప్పుదోవ పట్టించేందుకు హనీ ట్రాప్ అని తిరిగి యువతిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం హేయమైన చర్య అన్నారు.
అధికారాన్ని ఉపయోగించుకుని బిజెపి అగ్ర నాయకుల కుమారులు ఇలాంటి దృశ్చర్యలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు అని తెలిపారు. బిజెపి రేపిస్టులకు సత్కారాలు చేయడం, అత్యాచారాలు చేసిన వారిని ఊరేగించడం బీజేపీ పాలిత రాష్ట్రల్లో ఎన్నో చూశామన్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపిని మహిళలందరూ చీత్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోతే మహిళా బిల్లు అని మొసలి కన్నీరు కార్చిన నటుడు మోదీ అని ఇప్పటికైనా మహిళలంతా ఐక్యమై బిజెపికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, నాయకులు పెండ్యాల సుమతి, తోట పెద్ద వెంకట రెడ్డి, ధనియాకుల రామయ్య, ఏటుకూరి ప్రసాదరావు, చామకూరి రవీందర్, పెంట్యాల నాగేశ్వరరావు, దుండగల వెంకటేశ్వర్లు, అర్వపల్లి శ్రీనివాస్, మల్లెబోయిన రాజశేఖర్ పాల్గొన్నారు.