బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు. చట్టం కేంద్ర మంత్రికి చుట్టమా..? పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయమా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని మణుగూరు, చర్ల, అశ్వారావుపేట, పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం, గుండాల, బూర్గంపహాడ్, ఇల్లెందు తదితర మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తామని, బండి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోయిందని, అందుకే ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సమాఖ్య నాయకురాళ్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజెపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగాయని విమర్శించారు. అధికార గర్వంతో అరాచకాలకు పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
– నమస్తే నెట్వర్క్, మే 12

