మహబూబాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ భారీ మెజార్టీతో గెలిపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తుది రౌండ్ వరకు బలరాంనాయక్ లీడ్ కొనసాగింది. తన సమీప సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై 3,46,089 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ ఆధిక్యత కనబర్చారు. 2009లో మానుకోట పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలుపొందారు.
అనంతరం ఆనాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో తిరిగి మానుకోట పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మానుకోట నుంచి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టికెట్ దక్కలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొంది భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌కు 6,12,774 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితకు 2,63,609 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్‌కు 1,10,444 ఓట్లు వచ్చాయి. బలరాంనాయక్‌కు కలెక్టర్, ఆర్వో అద్వైత్‌కుమార్ సింగ్ ధ్రువీకరణ పత్రం అందజేశారు.
పేదలకు సేవచేసే అవకాశాన్ని మానుకోట ప్రజలు నాకు ఇచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తాం. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతా. ప్రధానంగా ఈ నియోజకవర్గ పరిధిలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, భద్రాచలం ఆలయ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్, పలు కళాశాలలు తెచ్చినం. మళ్లీ వాటిని అప్‌గ్రేడ్ చేయిస్తా. అనేక ప్రాంతాల్లో హైలెవల్ వంతెనలు లేక పేద ప్రజలకు ఇబ్బంది అవుతోంది. వాటి పైన ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తా. మానుకోట పార్లమెంట్ పరిధి ఎక్కువగా గిరిజన ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా ప్రజల వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తా. మానుకోట, కేసముద్రం, పలు స్టేషన్లలో రైళ్లు హాల్టింగ్ చేసేలా చూస్తా. ఇంత మెజార్టీతో గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా గెలుపునకు సహకరించిన పార్టీ శ్రేణులకు అండగా ఉంటా. – మహబూబాబాద్ ఎంపీ, పోరిక బలరాంనాయక్