బూర్గంపహాడ్, ఏప్రిల్ 10 : వేసవి సెలవుల్లో యువత జాగ్రత్తగా ఉండాలని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో చెరువులు, వాగులు, కిన్నెరసాని, గోదావరి తదితర ప్రాంతాల్లో ఈతకు వెళితే యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి, కిన్నెరసాని ప్రాంతాల్లో యువత స్నానం చేద్దామని దిగితే లోతు తెలియకుండా నీటిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సెలవు సమయాల్లో చెరువులు, కుంటల వైపు వెళ్లనీయకుండా పర్యవేక్షణ చేయాలని, వేసవి సెలవు సమయాల్లో క్రీడలు, డ్రాయింగ్ తదితర వాటిపై నైపుణ్యత ప్రదర్శించాలని, ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.