హైడ్రా ధ్వంసరచనకు బాధితులెందరో.. అరాచక పదఘట్టనల కింద పడినలిగిన దీనులెందరో! మూసీ పరీవాహకం కావొచ్చు! సున్నంచెరువు పరిసరాలు కావొచ్చు! ఖాజాగూడ కట్టకింద కావొచ్చు! బతుకమ్మకుంట, లోతుకుంట.. ఇలా ప్రాంతమేదైనా పేదలనే టార్గెట్ చేసింది హైడ్రా! చెరువుల రక్షణ ముసుగులో అమాయకులపైనే విరుచుకు పడింది. తెల్లవారకముందే బుల్డోజర్లను తోలింది. పట్నం నిద్ర లేచే సరికి.. శిథిలాలను గుట్టలుగా పోసింది. కండ్లముందే కలలు కూలుతుంటే గుండెపగిలిన పేదల రోదన పట్టలేదు. రోడ్డున పడిన చిన్నారుల కన్నీటికీ యంత్రభూతం మనసు కరుగలేదు.
కాళ్లకింది నేలనూ కబళించే పాలకుల కాళ్లకు మడుగులొత్తింది హైడ్రా! బలిసినోళ్ల కబ్జాలపై కండ్లు, నోరు మూసుకున్నది. కన్నూమిన్నూ కానకుండా, చట్టాన్ని ఖాతరు చేయకుండా.. తానే సర్వాధికారినన్నట్టు వ్యవహరించిన రంగనాథ్.. ఏ అధికారం అండ చూసుకొని 63 సార్లు కోర్టు ధిక్కరణకు, ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారు? ‘కోర్టుల పని కోర్టులు చేస్తే.. నా పని నేను చేస్తా’ అనే ఆయన అహంకరించి మాట్లాడింది ఎవరి అండ చూసుకొని? ఏ నడిమంత్రపు నాయకుల ప్రాపకం కోసం తప్పుల మీద తప్పులు చేశారు? హైకోర్టు తాజా తీర్పుతో ‘వెయ్యి కొర డా’ దెబ్బలు కొట్టినట్టయ్యింది ‘హిట్లర్ మెచ్చిన పేరు పెట్టా.. విధ్వంసం సృష్టించా’ అంటూ హైడ్రాకు కితాబిచ్చిన మరో హిట్లర్‌కు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది! ఒకరికి చావుదెబ్బ! ఇంకొకరికి చెంపదెబ్బ!
చట్టానికి కండ్లు లేకపోవచ్చు. కానీ, న్యాయానికి అంతర్దృష్టి ఉన్నది. అది బాధితుడి కన్నీటిని చూడగలదు! తుడువగలదు! పగబట్టిన వ్యవస్థను అడ్డుకోగలదు! పట్టపగ్గాల్లేకుండా పోయిన యంత్రాంగానికి పలుపుతాడు వేయగలదు! ఒక్క పెన్నుగీతతో, లక్ష్మణరేఖ గీయగలదు. ‘హైడ్రా’గన్ల కోరలు పీకగలదు! హైరార్కీ అరాచకానికి కీళ్లు విరచగలదు! గ్రీకు పురాణాల ప్రకారం తొమ్మిది తలల మహాసర్పం పేరు హైడ్రా! లెర్నియన్ హైడ్రా! దానికి ఒక తలనరికితే.. మరో రెండు తలలు మొలుస్తాయి. తన 12 సాహసకృత్యాల్లో భాగంగా వీరుడైన హెర్క్యులస్ ఆ భయంకర సర్పాన్ని సంహరించాడు. హైడ్రా నుంచి హెర్క్యులస్ ఒలంపస్ మహాపర్వతాన్ని కాపాడాడు! హైడ్రా నుంచి హైకోర్టు హైదరాబాద్‌ను కాపాడింది! హ్యాట్సాఫ్.. హైకోర్ట్!
విధ్వంసక విషసర్పంలా హైడ్రా మారకూడదు!
గ్రీకు పురాణాల్లో ‘హైడ్రా’ అనే తొమ్మిది తలల సర్పం ఉన్నది. ఆ పామును హతమార్చడం అసాధ్యం. ఒక తల నరికితే రెండు తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా దానిలా మారడానికి వీల్లేదు. అడ్డూఅదుపూ లేకుండా, ఇష్టానుసారం వ్యవహరించేందుకు హైడ్రాను అనుమతించలేం. అనుమతిస్తే ప్రజల హకులను పరిరక్షించాల్సిన కోర్టుకు మరణశాసనమే అవుతుంది.
– విచారణ సందర్భంగా జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగిండానికి వీలులేదని స్పష్టం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నరకాలంలోనే ఏకంగా 63 కోర్టు ధికరణ కేసులు దాఖలవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆయన ఏ స్థాయిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారో స్పష్టం అవుతున్నదని పేర్కొన్నది. ఇలాగే వదిలేస్తూ పోతే గ్రీకు పురణాల్లో ‘హైడ్రా’ పేరుతో ఉన్న చావులేని అనేక తలల పాములా ఈ హైడ్రా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి.. కోర్టు ఆదేశాలను వరుసగా ధికరించడం, స్వయంగా కోర్టుకు హాజరై ఇచ్చిన హామీలను సైతం తుంగలోతొక్కడం, న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రంగనాథ్‌ను వెంటనే కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని ఉత్తర్వులు వెలువరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా మలాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టగా, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ హైకోర్టులో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం మరోసారి విచారణ జరిపారు.
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. హైడ్రా కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లో బేషరతుగా క్షమాపణ చెప్పారని, కోర్టు ధికరణ కేసు విచారణను ముగించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఒకే కేసులో మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవ్వడం అసాధారణ విషయమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి, కోర్టులో జరిగిన విషయాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తొలగించాలని, అర్హత కలిగిన మరో అధికారిని నియమించాలని ఆదేశించారు.
రోడ్లు, కాలువలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తులను రక్షించడం హైడ్రా ప్రధాన బాధ్యతే.. కానీ, చట్టబద్ధమైన హకులు నిర్ధారితమైన ప్రైవేట్ భూముల్లోకి ప్రవేశించి, కూల్చివేతలు చేయడానికి ఎలాంటి అధికారం హైడ్రాకు లేదు. కోర్టు ఉత్తర్వులను ధికరించడం తాతాలికంగా ధైర్యంగా కనిపించినా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
-హైకోర్టు

హైడ్రా కమిషనర్ స్వయంగా కోర్టుకు హాజరై ఇచ్చిన హామీని ధిక్కరించారని ఇది తీవ్రమైన విషయమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘కోర్టు ఎదుట ఇచ్చిన హామీ అమల్లో ఉన్న తర్వాత దానికి విరుద్ధంగా తీసుకునే చర్యలకు ఎలాంటి న్యాయబద్ధమైన సమర్థన ఉండదు. ప్రజా ప్రయోజనం పేరుతో కోర్టు ఆదేశాలను పకనబెట్టి చర్యలు తీసుకుంటామంటే ఏ చట్టమూ అనుమతించదు. ఏ న్యాయస్థానమూ సమ్మతించదు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కోర్టు ధికరణ పిటిషన్లు పెరగడం ఆందోళనకమని పేర్కొన్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఉత్తర్వుల అమలే చట్టబద్ధ పాలనకు మూలాధారమని, రాజ్యాంగం ఇదే నిర్దేశిస్తున్నదని గుర్తుచేశారు.
కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని ఉద్దేశపూర్వక ఉల్లంఘనగానే పరిగణించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. కాబట్టి హైడ్రా చర్యలు కచ్చితంగా కోర్టును ధిక్కరించడమే అని తేల్చిచెప్పారు. ఈ నెల 20న జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై, నగర ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే చర్యలు చేపట్టామని ఇచ్చిన వివరణ సమర్థనీయంగా లేదని చెప్పారు. ‘ప్రజల ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ వంటి బాధ్యతలు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఉన్నాయి. హైడ్రా ఆ చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడేందుకు వీల్లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుంది.
హైడ్రా కమిషనర్‌పై ఇప్పటికే 63 కోర్టు ధికరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రిజిస్ట్రీ నివేదిక ఇచ్చింది. ఇన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నా కమిషనర్ రంగనాథ్ వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించకపోవడం తీవ్ర ఆందోళనకర విషయం’ అని పేర్కొన్నారు. తమ ముందున్న ఒక్క కేసులోనే మూడుసార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా స్పష్టం అవుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని ఉపేక్షించలేమని స్పష్టంచేశారు. ప్రజలు కోర్టును ఆశ్రయించేందుకు రాజ్యాంగం ప్రాథమిక హకును కల్పించిందని గుర్తుచేశారు. దీంతోపాటు కోర్టు తీర్పు ఫలితాన్ని సకాలంలో పొందే హకు కూడా రాజ్యాంగబద్ధమైనదే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్రీకు పురాణంలో హైడ్రా అనే అనేక శిరస్సులతో కూడిన పాము గురించి ఉన్నది. ఆ పామును హతమార్చడం అసాధ్యం. ఆ జలరాక్షసికి ఉన్న ఒక తలను నరికితే దాని స్థానంలో రెండు కొత్త తలలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంస్థ గ్రీకు పురాణంలోని హైడ్రాలా మారడానికి వీల్లేదు. అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తామనే హైడ్రాను అనుమతిస్తే ప్రజల హకులను పరిరక్షించాల్సిన కోర్టుకు మరణశాసనమే అవుతుంది.
-హైకోర్టు
‘నిజమైన క్షమాపణ అంటే హృదయపూర్వక పశ్చాత్తాపంతో, తొలి అవకాశంలోనే చెప్పాలి. కోర్టు ధికరణ కేసుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పడం ప్రాథమిక అంశమన్న విషయం తెలిసి కూడా మొదట క్షమాపణ చెప్పలేదు. శిక్ష తప్పించుకోవడానికి సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్లో క్షమాపణ చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పడం పిరికివాడి చర్య మాత్రమే.. ఇందులో ఎకడా నిజాయితీ లేదు, పశ్చాత్తాపం లేదు. చివరిదశలో చెప్పే క్షమాపణను నిజమైన క్షమాపణగా పరిగణించలేం.
-హైకోర్టు
సెక్రటరీ స్థాయి హోదాలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలి న్యాయబద్ధంగా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. గ్రీకు పురాణాల్లో ‘హైడ్రా’ పేరుతో ఉన్న అనేక తలల జలరాక్షసితో (పాము వంటి ఆకారం) హైడ్రాను పోల్చారు. ‘గ్రీకు పురాణంలో హైడ్రా అనే అనేక శిరస్సులతో కూడిన పాము గురించి ఉన్నది. ఆ పామును హతమార్చడం అసాధ్యం. ఆ జలరాక్షసికి ఉన్న ఒక తలను నరికితే దాని స్థానంలో రెండు కొత్త తలలు పుట్టుకొస్తాయి.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హైడ్రా సంస్థ గ్రీకుపురాణంలోని హైడ్రాలా మారడానికి వీల్లేదు. అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తామనే హైడ్రాను అనుమతిస్తే ప్రజల హకులను పరిరక్షించాల్సిన కోర్టుకు మరణశాసనమే అవుతుంది’ అని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల హకులను కాపాడాల్సిన సంస్థ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థలు స్వతంత్ర అధికార కేంద్రాలుగా మారి కోర్టు ఉత్తర్వులను విస్మరిస్తే అది న్యాయపాలనకు ‘మరణ మృదంగం లేదా మృత్యు ఘంటిక’గా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళ వ్యక్తం చేశారు. హైడ్రా కూడా చట్టం నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలని, అధికార దుర్వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రంగనాథ్ దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. ‘నిజమైన క్షమాపణ అంటే హృదయపూర్వక పశ్చాత్తాపంతో, తొలి అవకాశంలోనే చెప్పాలి. కోర్టు ధికరణ కేసుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పడం ప్రాథమిక అంశమన్న విషయం తెలిసి కూడా మొదట క్షమాపణ చెప్పలేదు. క్షమాపణలు చెప్తేనే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనిస్తామని గత విచారణలో చెప్పాం. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని శిక్ష తప్పించుకోవడానికి సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్లో క్షమాపణ చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పడం పిరికివాడి చర్య మాత్రమే’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నేను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదు.. పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవం.. ఈ విషయంలో కోర్టు మరోవిధంగా అనుకుంటే.. క్షమించాలని కోరుతున్నా’ అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో ఎకడా నిజాయితీ లేదు, పశ్చాత్తాపం లేదు. కాబట్టి అఫిడవిట్‌ను తిరసరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
చివరిదశలో చెప్పే క్షమాపణను నిజమైన క్షమాపణగా పరిగణించలేమని స్పష్టంచేశారు. పలు కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. కోర్టు ఎదుట ఇచ్చిన హామీలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం కోర్టు ధికారమే అవుతుందని తెలిపారు. కోర్టుకు ఇచ్చిన హామీ కూడా కోర్టు ఆదేశాలతో సమానమని స్పష్టంచేశారు. ‘గత ఐదేండ్లలో హైకోర్టులో నమోదైన 9,290 కోర్టు ధికరణ కేసుల విచారణ జరుగుతున్నది. కానీ ఏడాదిన్నర కాలంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఏకంగా 63 కేసులు ఉన్నాయి. మా ముందున్న రెండు కేసులతో కలిపితే 65 కేసులు. ఒక అధికారిపై భారీ సంఖ్యలో ధిక్కరణ కేసులు ఉండటం ఆశ్చర్యం. కోర్టుకిచ్చిన హామీని మరుసటిరోజునే తుంగలోకి తొకేసి, హైకోర్టు హెచ్చరిక తర్వాత క్షమాపణలు చెప్తే ఎలా అనుమతించాలి? ఎందుకు అనుమతించాలి?’ అని నిలదీశారు.
‘కోర్టులు ప్రజల కోసం ఉన్నాయి. శాసన, పరిపాలనా వ్యవస్థల్లో లోటుపాట్లు ఉంటే ప్రజలు రాజ్యాంగ ధర్మాసనాల వద్దకు వస్తారు. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హకులను రక్షించాలి. కోర్టు ఉత్తర్వుల అమలే ప్రజాస్వామ్యానికి పునాది’ అని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చిన్న విషయంలా కనిపించవచ్చని, కానీ దాని పరిణామాలు నీడలా చాలా కాలం వెంటాడుతాయన్నారు. తీర్పులు సమర్థవంతంగా అమలైనప్పుడే కోర్టుల పట్ల గౌరవం నిలుస్తుందన్నారు. కోర్టు ఆదేశాలను ధికరించే అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం న్యాయస్థానం రాజ్యాంగబద్ధ విధి అని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయడం ప్రతి ప్రభుత్వ అధికారి రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా ప్రభు త్వం సమర్థమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
రంగనాథ్ వ్యవహార శైలి కోర్టు ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఉన్నది. కోర్టు ఉత్తర్వులు, హామీ ఉల్లంఘనల ద్వారా చట్టబద్ధ పాలనకు తిలదోకాలిచ్చారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగానే వెళ్లామన్న వాదన ఆమోదయోగ్యం కాదు. రికార్డులను పరిశీలిస్తే హైడ్రా అధికారులు పిటిషనర్ స్థలంలోకి వెళ్లి తాతాలిక నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ చర్యలను హైడ్రా కూడా తోసిపుచ్చలేదు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 99, 191ల్లో హైడ్రా విధివిధానాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ అందుకు అనుగుణంగా హైడ్రా అడుగులు లేవు.
-హైకోర్టు
రంగనాథ్‌లో చిత్తశుద్ధి కనబడలేదు కోర్టు ఉత్తర్వులు, తీర్పుల అమలు అనేది ‘చట్టం ముందు అంతా సమానమే’ అనే సూత్రంలో అంతర్లీనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం లేదా తీరని జాప్యం చేయడం వల్ల కక్షిదారు ప్రాథమిక హకులు దెబ్బతింటాయన్నారు. కక్షిదారులకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేస్తేనే ప్రజలకు కూడా వ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ కేసులో రంగనాథ్ అనే అధికారికి కోర్టు ఆదేశాలను అమలు చేయడం, వాటిని గౌరవించడంపట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతున్నదని పేర్కొన్నారు.
ఒక కేసులో ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడమే ఆ అధికారి తీరును స్పష్టం చేస్తున్నదన్నారు. ‘రంగనాథ్ వ్యవహార శైలి కోర్టు ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఉన్నది. కోర్టు ఉత్తర్వులు, హామీ ఉల్లంఘనల ద్వారా చట్టబద్ధ పాలనకు తిలదోకాలిచ్చారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగానే వెళ్లామన్న వాదన ఆమోదయోగ్యం కాదు. రికార్డులను పరిశీలిస్తే హైడ్రా అధికారులు పిటిషనర్ స్థలంలోకి వెళ్లి తాతాలిక నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ చర్యలను హైడ్రా కూడా తోసిపుచ్చలేదు. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 99, 191ల్లో హైడ్రా విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకు అనుగుణంగా హైడ్రా అడుగులు లేవు’ అని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా ప్రజాస్వామ్యనికి పెనుముప్పుగా మారుతుందన్నారు.
ప్రజల హకులను కాపాడాల్సిన సంస్థ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదకరం. ప్రభుత్వ సంస్థలు స్వతంత్ర అధికార కేంద్రాలుగా మారి కోర్టు ఉత్తర్వులను విస్మరిస్తే అది న్యాయపాలనకు మరణ మృదంగం లేదా మృత్యు ఘంటికగా మారే ప్రమాదం ఉన్నది. హైడ్రా కూడా చట్టం నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి. అధికార దుర్వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదు.
-హైకోర్టు
ఐదేండ్లలో హైకోర్టులో నమోదైన 9,290 కోర్టు ధికరణ కేసుల విచారణ జరుగుతున్నది. కానీ ఏడాదిన్నర కాలంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఏకంగా 63 కేసులు ఉన్నాయి. మా ముందున్న రెండు కేసులతో కలిపితే 65 కేసులు! ఒక అధికారిపై భారీ సంఖ్యలో ధిక్కరణ కేసులు ఉండటం ఆశ్చర్యం. కోర్టుకిచ్చిన హామీని మరుసటిరోజునే తుంగలోకి తొకేసి, హైకోర్టు హెచ్చరిక తర్వాత క్షమాపణలు చెప్తే ఎలా అనుమతించాలి? ఎందుకు అనుమతించాలి?
-హైకోర్టు
‘65 కోర్టు ధికరణ కేసులను ఎదురొంటున్న రంగనాథ్ లాంటి అధికారికి అవకాశం ఇస్తే అది సానుకూల మార్పు లభిస్తుందనే నమ్మకం లేదు. అనేక కోర్టు ధికార కేసులు దాఖలు తర్వాత కూడా సదరు అధికారిలో ఏవిధమైన మార్పు కనిపించడం లేదు. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవిలో కొనసాగిస్తే చట్టబద్ధపాలన ప్రమాదంలో పడుతుంది. ఈ మేరకు గతంలోనే హైకోర్టు గమనించి హెచ్చరించింది. అయినా సదరు అధికారి సంయమనం పాటించలేదు. కాబట్టి ఆ అధికారిని కమిషనర్ పదవి నుంచి తప్పించాలి. తగిన అర్హతలు ఉన్న మరో అధికారిని నియమించాలి. కోర్టు ఆదేశాలను విచక్షణారహితంగా ధికరించడం రంగనాథ్‌కు పరిపాటి అయ్యింది.
ఇలాంటి అధికారి వల్ల చట్టబద్ధపాలన ప్రమాదంలో పడుతుంది. రూల్ ఆఫ్ లా విపతర పరిస్థితుల్లో పడేందుకు కారణమైన అధికారిని (రంగనాథ్ )అదే పదవిలో కొనసాగించడానికి వీల్లేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన శిక్షలను సిఫారసు చేయడం తప్ప మరో మార్గం లేదు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి ఆదేశాలు వెలువడుతాయని, కాబట్టి సీఎస్ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
‘వాస్తవానికి కోర్టుధికరణ కేసులో అడ్వొకేట్ జనరల్‌ను పిలవాల్సిన అవసరం లేదు. అయితే, రంగనాథ్ అనే అధికారి ఐజీ ర్యాంకులో, కార్యదర్శి స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. హైడ్రా ఏర్పాటుకు కారణమైన జీవో 99లో ప్రభుత్వ ఆస్తులను, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించడమే ప్రధాన విధిగా పేర్కొన్నారని గుర్తు చేశారు. చట్టపరంగా విధులు నిర్వహించనప్పుడు జనం కోర్టులకు వస్తారు. కోర్టు అధికారులకు ఆదేశాలను జారీ చేసినప్పుడు అమలు చేయాల్సిందే. లేనిపక్షంలో అప్పీల్ ద్వారా ఉత్తర్వులు పొందాలి. ఇవేమీ చేయకుండా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, కోర్టుధికరణ కేసులో స్వయంగా హాజరై హామీ ఇచ్చి కూడా ఉల్లంఘన కొనసాగించడం తీవ్ర విషయం.
ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు రాజ్యాంగంలోని 215 అధికరణం కింద ఉత్తర్వులు జారీ చేసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతాయి. ఇది కోర్టుల విధి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులను అమలు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలు పెంచాలి. తీర్పులను అధికారులు అమలు చేసినప్పుడే కోర్టుల ఔనత్యం, గౌరవం పెరుగుతుంది’ అని వివరించారు. ‘రోడ్లు, కాలువలు, ప్రభుత్వ ప్రజా ఆస్తులను రక్షించడం హైడ్రా ప్రధాన బాధ్యతే అని, అయితే చట్టబద్ధమైన హకులు నిర్ధారితమైన ప్రైవేట్ భూముల్లోకి ప్రవేశించి, కూల్చివేతలు చేయడానికి ఎలాంటి అధికారం హైడ్రాకు లేదన్నారు.
‘శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం ఏదీ చట్టవిరుద్ధంగా లేదా ఏకపక్షంగా వ్యవహరించకూడదు. అనేక సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ, కోర్టు ఉత్తర్వులను ధికరించడం తాతాలికంగా ధైర్యంగా కనిపించినా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి’ అని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మ కం, గౌరవం, విశ్వాసం కాపాడాలంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూసీ ఒడ్డున హైదర్షాకోట్ విఘ్నేశ్వరకాలనీలో స్థానికుల సంబురాలు