సారంగాపూర్, జూలై 27 : ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్, పంపుసెట్లకు రిపేరు చేయించి వినియోగంలోకి తేవాలని సూచించారు. పంటలకు సమయానికి నీళ్లివ్వకపోతే వానకాలం సాగు ఎలా సాధ్యమవుతుందని, సీజన్ అయిపోయాక మరమ్మతులు చేయిస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు. మరమ్మతులు చేయించకుంటే రైతులందరు కలిసి ప్రజావాణి ఎదుట కూర్చొంటారని స్పష్టం చేశారు. అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీర్పూర్ మండలంలోని కొల్వాయి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సాగుకు నీరందడం లేదని రైతులు గోడు వెల్లబోసుకున్నారు. దీంతో జీవన్ రెడ్డి స్పందించి వెంటనే సంబంధిత శాఖ అధికారులు డీఈ, ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు. కొల్వాయి శివారు ఎత్తిపోతల పథకంలో మోటర్లు పనిచేయక ఏడాది గడిచినా మరమ్మతులు చేయించడం లేదని మండిపడ్డారు.
అధికారులు అంచనాలు రూపొందించేది ఎప్పుడు? నీళ్లు అందించేది ఎప్పుడని ప్రశ్నించారు. రైతుల అదృష్టం కొద్ది కాలువల్లో నీళ్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మోటర్లకు రిపేర్లు చేయించాలని సూచించారు. రేకులపల్లిలో కూడా పంపుసెట్టు మరమ్మతు చేయాల్సి ఉన్నదని, కమ్మునూర్లో ట్రాన్స్ఫార్మర్ లేక పంపుసెట్లు వినియోగించడం లేదన్నారు. మంగెళలో ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మ్మెంట్ ఇప్పటి వరకు రాలేదన్నారు. ఈనెల 31లోగా మోటర్లు మరమ్మతులు చేయించాలని, ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరిగితేనే వానకాలం పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆగస్ట్ ఒకటో తేదీ నాటికి పంపుసెట్లు సిద్ధం చేయకుంటే నీళ్లుండి కూడా పంటలు ఎండిపోయే ప్రమాదమున్నదని వాపోయారు. అందుకు అధికారులే బాధ్యత వహించాల్సివస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పంపుసెట్లను పరిశీలించాలని, మరమ్మతులకు మాత్రం డబ్బులు లేవని చెప్పొద్దని సూచించారు. ప్రభుత్వ ఖజానా ఖాలీ అయిందని చెబితే రైతులే మరమ్మతులు చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.