కడెం: గ్రామాల్లో అధ్వానంగా మారుతున్న పారిశుధ్య పరిస్థితులు, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను ( Congress Failures ) నిరసిస్తూ కడెం( Kadem) మండల కేంద్రంలో బీఆర్ఎస్( BRS ) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి భూక్యా జాన్సన్ నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. రోడ్లు, వీధులు, కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అనంతరం కడెం వారసంత అంగడిబజార్లో రైతులు, వ్యాపారులు, వినియోగ దారులను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అవగాహన కల్పిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని తెలిపారు. కడెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన రోగులు, వారి కుటుంబ సభ్యులను కలిసి వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది, మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.