కేసీఆర్ రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ధర్నాకు వ్యతిరేకంగా సత్తుపల్లిలోని అన్నారుగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమిటో ముందు సమాధానం చెప్పాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు ₹2,500, వృద్ధులకు ₹4,000, దివ్యాంగులకు ₹6,000 పింఛన్లు, ఆటో డ్రైవర్లకు ₹12,000 సాయం, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ పదేళ్ల సువర్ణ పాలనను తెలంగాణ ప్రజలు ఏనాడూ మర్చిపోలేరు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ రాజీనామాపై స్వయంగా సీఎం పిలుపునిచ్చినా సొంత పార్టీ శ్రేణుల నుంచే స్పందన కరువైందని సండ్ర ఎద్దేవా చేశారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి.. ఆ తర్వాతే కేసీఆర్ గురించి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.