రామవరం, మే 22 : రోడ్డు ప్రయాణాల్లో రహదారి భద్రతా నియమాలు పాటించడం మనకు, మనపై ఆధారపడ్డ కుటుంబానికి ఎంతో క్షేమం అని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందిన నేపథ్యం లో “అయ్య బాబోయ్ బొగ్గు టిప్పర్లు” అంటూ గురువారం నమస్తే తెలంగాణ వెబ్ ఎడిషన్లో వచ్చిన వార్తకు స్పందించి శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 ఇంక్లైన్ లో బొగ్గు రవాణా చేసే టిప్పర్ డ్రైవర్లతో లారీ అసోసియేషన్ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. లారీ ఓనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి డ్రైవర్ కి లైసెన్సు ఉన్నదా లేదా గమనించాలని, లారీని కండిషన్లో ఉంచుకోవాలని, డ్రైవర్లు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.
అతివేగం అసలే వద్దని, మీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని, అందులో మీ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందన్నారు. అతివేగం ప్రమాదకరం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ముఖ్య కూడళ్ల వద్ద చూసి వాహనాన్ని నడపాలని, ఇన్సెంటివ్కు ఆశపడి వేగంగా నడిపి జనాల ప్రాణాలు తీయొవద్దని హెచ్చరించారు. కొందరు డ్రైవర్లు క్లీనర్లకు లారీలను అప్పజెప్పుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, టూ టౌన్ ఎస్ఐ కిశోర్, లారీ ఓనర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.