జూలూరుపాడు, ఆగస్టు 09 : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కొమరం భీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివాసులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఆదివాసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆదివాసులు చేసిన పోరాటాల ఫలితంగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జీఓ నంబర్ 3 పునరుద్ధరణ చేసి గ్రామ పంచాయతీలో పీసా చట్టం అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి, ఐటీడీఏ నుండి వచ్చే పథకాల గురించి ఆదివాసీలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే పోడు భూముల్లో ప్రభుత్వ బోర్లు వేయాలని కోరారు. ప్రతి ఆదివాసి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పలువురి గ్రామ పెద్దలకు, ఆదివాసి పూజారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్, జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్, ఆదివాసి నాయకులు తెల్లం నరసింహరావు, యదలపల్లి వీరభద్రం, మాజీ వైస్ ఎంపీపీ కొడం సీతాకుమారి, యదలపల్లి కళశ్రీ, తాటి రోహిణి, బచ్చల రేణుక, గ్రామ పెద్దలు, యువత, ఉద్యోగస్తులు, మహిళలు, గిరిజన పూజారులు పాల్గొన్నారు.
Julurupadu : సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : అప్పాల ప్రసాద్