బూర్గంపహాడ్, మే 04 : భద్రాచలం పేపర్ బోర్డు కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం టీపీఎం, సురక్షను బహిష్కరించి కార్మిక నేతలు నిరసన తెలిపారు. వేతన ఒప్పందం ముగిసి 34 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో కార్మికులు ఆగ్రహానికి గురై నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీఎం సురక్షను బహిష్కరిస్తున్నట్లు ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి ప్రకటించారు. ఐటీసీ అడ్మిన్ బ్లాక్ ఎదుట ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
కార్మికుల కష్టార్జితంతో లాభాలు గడిస్తున్న యాజమాన్యం వారి కనీస అవసరాలను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. డిమాండ్లతో పాటు 30న పదవీ విరమణ చేసిన కార్మికులకు కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.12 లక్షలు ఇప్పించాలని, ఐటీసీ చరిత్రలో టీపీఎంను బహిష్కరించిన చరిత్ర ఐఎన్టీయూసీదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు, ఆఫీస్ బేరర్లు, కార్మికులు పాల్గొన్నారు.