రామవరం, సెప్టెంబర్ 13 : స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం అలవాటుగా, అలసత్వంగా మారిందని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి యాజమాన్యం మొండి వైఖరిని వివరిస్తూ ఏరియాలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఏరియాలో అన్ని మైన్, డిపార్ట్మెంట్లలో గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో శుక్రవారం జరగాల్సిన సీఎండీ స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించడానికి గల కారణాలు, పలు విషయాలను కార్మికులకు వివరించారు. గత సంవత్సర కాలంగా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో పలు కార్మిక సమస్యలపై రెండుసార్లు డెరైక్టర్ పా ఒకసారి, సంస్థ సీఎండీతో పలు అంశాల మీద చర్చ చేసి సత్వరమే కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు పరుస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటికీ ఆ సమస్యల పట్ల సర్క్యులర్ లు జారీ చేయకుండా జాప్యం చేస్తుండటం, మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మిక సమస్యలను పక్కదారి పట్టించడం చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మీటింగ్లో మారుపేర్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం వాటి అమలుకు అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని దాటవేస్తూ కనీసం సమస్య పరిష్కారం కోసం సర్క్యులర్ లు కూడా ఇవ్వకుండా బాధిత కార్మికులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. సొంత ఇంటి పథకం కింద కమిటీ వేసి విధివిధానాలు ప్రకటించి అందుకు అనుగుణంగా అమలు పరుస్తామని తెలిపిన యాజమాన్యం కనీసం కమిటీలో సభ్యులను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. మెడికల్ బోర్డు విషయంలో ఏసీబీ విచారణ పేరుతో మెడికల్ బోర్డ్ నిర్వహించకుండా కార్మికుల పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎప్పటిలాగే యధావిధిగా బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వాస్తవ లాభాలు ప్రకటించి అందులో 35 శాతం కార్మికులకు ఇవ్వాలన్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ పేర్క్స్ విషయంలో లాభాల వాటాకు ముడిపెడుతూ యాజమాన్యం కొర్రీలు పెట్టడం సమంజసం కాదని, లాభాల వాటా కార్మికుల కష్టానికి ప్రతిఫలంగా ఆనాడు ఏఐటీయూసీ పోరాటాలు చేసి సాధించిన హక్కు అని ఇన్కమ్ ట్యాక్స్ పేర్క్స్ రిటర్న్స్ విషయంలో దానికి సంబంధం లేకుండా కోల్ ఇండియా మాదిరి పెర్క్స్ మీద రిటర్న్స్ యజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్ఫర్ పాలసీని తీసుకువచ్చి కార్మికులను బదిలీ చేసే విషయంలో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈపీ ఆపరేటర్ల విషయంలో ఒప్పుకున్న ప్రమోషన్ పాలసీ మీద కూడా ఇంతవరకు సర్క్యులర్లు ఇవ్వలేదన్నారు. డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరగా వారిపై నిర్ణయాన్ని నాన్చివేత ధోరణితో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అన్ని కేడర్ స్కీమ్ లు పరిష్కరించాలని డిమాండ్ చేయగా వాటి మీద కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ఓవర్మన్ ల ప్రమోషన్ పాలసీ పట్ల కూడా ఆదేశాలు జారీ చేయలేదని, ఖాళీలు లేవని తాత్సారం చేయడం పట్ల గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. క్లరికల్ ఖాళీలు పూరించాలని, రెండు సంవత్సరాల నుండి కనీసం క్లర్క్ పోస్ట్ ల కోసం రాత పరీక్ష కూడా పెట్టకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. N -1 ప్లే డే విధానం తీసివేసి కార్మికులకు పాత పద్ధతిలోనే ప్లే డే లు, phd, OT లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ కతర్ల రాములు, ఆఫీస్ బేరర్ సందేబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, గుమ్మడి వీరయ్య, ఏరియా వర్క్ షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ కమల్, ఆర్ సీ హెచ్ పీ సహాయ కార్యదర్శి సురేందర్, జీకే ఓసి పిట్ కార్యదర్శి ఏం ఆర్ కే ప్రసాద్, మెంగెన్ రవి, సీనియర్ నాయకులు బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, పీవీకే అసిస్టెంట్ పిట్ కార్యదర్శి పవన్, భుక్య రమేష్, కర్రు రమేష్, గంగారాం, సుమన్, తిరుపతి, కుమార్ పాల్గొన్నారు.