చుంచుపల్లి, ఆగస్టు 01 : మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ అలాగే ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బ్లాక్ మెయిల్, ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చన్నారు. జిల్లా షీ టీమ్స్ నంబర్ 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలుపొచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
మానవ అక్రమ రవాణా చేసి, వారి అవయవాలను విక్రయించడం, వారితో వెట్టిచాకిరి చేయించడం, వ్యభిచారంలోకి లాగడం, బాల్య వివాహాలు చేయడం లాంటివి జరుగకుండా ఏహెచ్టీయూ సిబ్బంది భాద్యతగా పనిచేయాలని సూచించారు. ఇటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి నిరంతరం జిల్లా మొత్తం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సీఐ రాము, ఏఎస్ఐ నాగయ్య, షీ టీమ్ సభ్యులు మల్లికాంబ, రాంబాబు పాల్గొన్నారు.