భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 15 : కొర్రమీను చేపల పెంపకానికి మహిళలు ముందుకు రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులకు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొర్రమీను చేపల పెంపకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసి వస్తుందన్న గ్యారంటీ లేదు. అంతేకాకుండా ఇంటిల్లిపాది నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. కావునా ఒక్కసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం వచ్చే చేపల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
చేపల పెంపకంలో కొర్రమీను మాత్రమే ఎందుకంటే అది ఎటువంటి వాతావరణం అయినా తట్టుకుని బ్రతుకుతుందన్నారు. పావుగుంట ప్రదేశంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఇంకో పావుగుంట ప్రదేశంలో ఫామ్ పౌండ్ నిర్మాణం, సుమారు మూడున్నర రూపాయలతో చేపల పెంపకానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకోవచ్చన్నారు. ఒక్కో చేప పిల్ల ఖరీదు రూ.15 కాగా 1000 చేపల పిల్లల పెంపకం చేపట్టి అందులో 100 చేప పిల్లలు చనిపోయి 900 చేప పిల్లలు మీ చేతికి వచ్చినా కిలో సుమారు రూ.300కు అమ్మినా రూ. 2,70,000 కేవలం 7 నెలల్లో వస్తాయని తెలిపారు.
కొర్రమీను చేపల పెంపకం యూనిట్ స్థాపన కోసం బ్యాంకుల ద్వారా పీఎంఈజిపి పథకం ద్వారా 35 శాతం సబ్సిడీ వస్తుందని, చేపల పెంపకానికి కావలసిన ఫామ్ పౌండ్ నిర్మాణం ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కొర్రమీను చేపల పెంపకం ద్వారా కేవలం రెండు సంవత్సరాల లోనే పెట్టుబడి వాపసు వస్తుందని లక్షల్లో ఆదాయం చేకూరుతుందని మరి ఇతర పంటల్లోనూ ఇంత ఆదాయం రాదన్నారు. చేప పిల్లల్ని వాటర్ ట్యాంకర్ లో నాలుగు నెలలు పెంచిన తర్వాత వాటిని నీటి కుంటలో మట్టి మరియు విశాలమైన ప్రదేశంలో పెంచడం ద్వారా పెద్ద పరిమాణంలో తయారవుతాయని తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు దీటుగా వ్యవసాయంలో లాభాలను పొందవచ్చన్నారు.
అనంతరం ఆక్వా కనెట్స్ సమస్త వారు కొర్రమీను చేపల పెంపకం, మార్కెటింగ్, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు, మహిళలకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం జిల్లాలో ప్రయోగాత్మకంగా అశ్వాపురం, సుజాతనగర్ లో కొర్రమీను చేపల పెంపకంలో విజయం సాధించిన రైతులు దుర్గాప్రసాద్, జంపన్న అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, మత్స్య శాఖ ఏడి ఇంతియాజ్ ఖాన్, ఆక్వా కనెట్స్ సంస్థ ప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు, ఏపీఎంలు సుమారు 400 మంది పాల్గొన్నారు.