టేకులపల్లి, జూన్ 24 : టేకులపల్లి మండలంలోని బోడు గ్రామ పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచం స్వరూప అత్త చుక్కమ్మ (55) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చుక్కమ్మ సమీపంలోని మొక్కంపాడు గ్రామంలో ఉన్న లాలు చేనులో పత్తి విత్తనాలు నాటే కూలి పనికి వెళ్లింది. ఈ సందర్భంగా చేనుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటే ప్రయత్నంలో దానికి అకస్మాత్తుగా విద్యుత్ ప్రవహించడంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోంది. తోటి కూలీలు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. చుక్కమ్మకు భర్త మల్లయ్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సుధీర్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టేకులపల్లి (బోడు) ఎస్ఐ పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేశారు. కొత్తగూడెం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బోడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.