హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఆగస్టు 3తో ముగియనున్నది. రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వందశాతం పూర్తయినప్పటికీ, డిజిటలైజేషన్ 76.72 శాతం మాత్రమే పూర్తయింది. 78,75,942 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పెండింగ్లో ఉన్నది.
సీఈవో కార్యాలయం గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాలు డిజిటలైజేషన్లో అగ్రస్థానంలో నిలిచాయి. యాదాద్రి భువనగిరి 94.10% డిజిటలైజేషన్తో టాప్లో నిలిచింది. జనగామ జిల్లా 91.33, మెదక్ 90.47 , సూర్యాపేట 90.14, మహబూబాబాద్ 89.95, నల్లగొండ 88.97, జగిత్యాల 88.87 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న మెట్రోపాలిటన్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 ఓటర్లు ఉండగా, 26,32,203(55.57 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 60.46 %, రంగారెడ్డి జిల్లాలో 62.89 శాతం, సంగారెడ్డి జిల్లాలో 77.54 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.
