లక్ష్మీదేవిపల్లి, మే 25 : లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో సోమవారం కుక్క కాటుకి ఎం.రాములమ్మ(40) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చేతకొండలో ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాములమ్మపై సోమవారం వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో రాములమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాములమ్మ మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా వీధి కుక్కలు పలువురు చిన్నారులు, పెద్దవాళ్లపై దాడులు చేస్తున్నా అధికారులు, పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.