రామవరం, ఆగస్టు 13 : పార్టీలకు అతీతంగా ప్రజలందరి అభ్యున్నతి కోసం పాటుపడనున్నట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీగా ఎస్.కె సాబీర్ పాషా తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీగా ఎస్.కె సాబీర్ పాషా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రుద్రంపూర్, గౌతమ్పూర్ మసీదు పెద్దలు ఆయనను బుధవారం రుద్రంపూర్ మసీదులో పూలమాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు లభించిన ఈ అవకాశాన్ని పేదల అభ్యున్నతి కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనవుతానని చెప్పారు.
పరమత సహనం పాటిద్దామని తెలిపారు. ప్రగతిశీల ఆలోచన ఉన్న ప్రాంతం, పోరాటాల గడ్డ, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్లు చెప్పారు. అది మసీదు అయినా, మందిరమైనా, చర్చి అయినా ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు మహమ్మద్ అజీజ్ ఖాన్, అబ్దుల్ ఉమర్, అబ్దుల్ బషీద్, హుమాయిన్, రహమత్ హుస్సేన్, మజహర్ తాహర్, గౌస్, యాకూబ్, సీపీఐ చూంచుపల్లి మండలాధ్యక్షుడు వాసిరెడ్డి మురళి, మండల మాజీ అధ్యక్షుడు సలిగంటి శ్రీనివాస్, టోపీ సత్యనారాయణ పాల్గొన్నారు.