– సింగరేణి వ్యాప్తంగా సుమారు 500 మంది బోనస్ కోల్పోయినట్లేనా?
రామవరం, అక్టోబర్ 24 : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లించామని గొప్పలు చెప్పు కున్నారు మంత్రులు. కానీ ఆ చిత్తశుద్ధి నాయకుల్లో గాని, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల్లో లేకుండా పోయింది. దీంతో బోనస్ చెల్లింపులో కూడా కొర్రీలు పెడుతున్నారు. పాపం బోనస్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆశలు అడి ఆశలు కావాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో క్యూ ఎస్ ఎస్, క్యూ సి ఐ, ఐ జి, కోటక్, క్యూ ఎస్ ఎస్ కంపెనీలలో షాంప్లింగ్ మజ్దూర్‌గా సింగరేణి పర్చేజ్ టెండర్‌పై కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. కానీ వారికి లాభాల వాటా ప్రకటించినప్పుడు ఇచ్చే రూ.5,500 బోనస్‌ను చెల్లించక పోవడంతో సింగరేణి వ్యాప్తంగా పది ఏరియాల్లో పని చేస్తున్న సుమారు 500 మందికి బోనస్ అందలేదు.
ఇప్పటికే యూనియన్ నాయకులకు కూడా తమ గోడును వెల్లబోసుకున్నారు. సంస్థలో పనిచేస్తున్న పర్చేస్ టెండర్ మీద పని చేసే ప్రతి ఒక్కరికి బోనస్‌ను చెల్లించారని, తమకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమది కూడా పర్చేస్ టెండరే కదా, అయినప్పటికీ వారికి ఒక న్యాయం తమకో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరిలాగే తమకు కూడా బోనస్ చెల్లించాలని కోరుతున్నారు.