– ఆకట్టుకుంటున్న జూలూరుపాడు యువకుడి పెళ్లి పత్రిక
జూలూరుపాడు, జనవరి 30 : సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే దేవుళ్ల బొమ్మలు, రంగురంగుల డిజైన్లు, పట్టు వస్త్రాల అలంకరణలతో కనిపిస్తాయి. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన పెళ్లి పత్రికను అత్యంత వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి అద్దం పట్టేలా రూపొందించి అందరినీ ఆకట్టుకున్నాడు. అది పెళ్లి పత్రికా లేక టాబ్లెట్ షీటా అని భ్రమపడేలా ఉన్న ఆ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్‌గా మారింది. కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర భాస్కర్ – ధనమ్మ దంపతుల కుమారుడు కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. శిరీష కూడా ఎం.ఫార్మసి పూర్తి చేసి ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. వధూవరులిద్దరూ మెడికల్ రంగానికి చెందిన వారు కావడంతో, తమ వివాహ ఆహ్వానాన్ని కూడా అదే శైలిలో ఉండాలని భావించారు.
ఈ క్రమంలో తమ వృత్తిపై ఉన్న మమకారాన్ని చాటుకోవడమే కాకుండా, పది మందికీ గుర్తిండిపోయేలా ఆలోచించి నవీన్ తమ పెళ్లి పత్రికను ఒక టాబ్లెట్ స్ట్రిప్ ఆకారంలో డిజైన్ చేయించాడు. ఈ కార్డులో వాడిన పదజాలం కూడా మెడికల్ స్టైల్లోనే ఉండటం విశేషం. “Warning: Dear Friends Please Don’t Miss My Wedding” అంటూ సరదాగా హెచ్చరిస్తూనే, తమ వివాహానికి రమ్మని కోరడం బంధుమిత్రులను ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 4న జరగనున్న ఈ వివాహా వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని, ప్రత్యేకతను చాటుకున్న ఈ జంటకు స్థానికులు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Julurupadu : మెడికల్ వెడ్డింగ్ కార్డ్