– భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 11 : విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తగూడెం ఇల్లెందు క్రాస్‌రోడ్స్ లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అమరవీరుల సంస్మరణ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ… అటవీ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అటవీ సంపద సంరక్షణలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో అటవీ నేరాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపదను పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పని చేయాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తారమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉందని, ఇక్కడి గిరిజన సమాజానికి అడవులతో ఎంతోకాలంగా సన్నిహిత సంబంధం ఉందని కలెక్టర్ అన్నారు. కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన సమాజాలు అడవులతో మమేకమై జీవిస్తున్నారని, అటవీ శాఖ, గిరిజన సమాజాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఎంతో ముఖ్యమన్నారు. అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు గిరిజనుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, అటవీ హక్కులు తదితర అంశాలపై అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, గిరిజన సమాజాల భాగస్వామ్యంతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి రోహిత్ రాజు, జిల్లా అటవీ అధికారి సిధార్డ్ విక్రమ్ సింగ్, అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర అటవీ శాఖ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.