టేకులపల్లి, జనవరి 05 : గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం టేకులపల్లి మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, పార్టీలో కష్టపడిన వారికి ఎప్పటికి గుర్తింపు ఉంటుందన్నారు. యూరియా కష్టాలు రైతులకు ఇంకా కొనసాగుతున్నాయని, రైతులు, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చిదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. మండలంలోని 36 పంచాయతీల్లోని గ్రామాల్లో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్కినేని సురేందర్రావు, భూక్యా దళ్ సింగ్ నాయక్, టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలునాయక్, ఆమెడ రేణుక, సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.