రుద్రంపూర్, ఏప్రిల్ 20 : ఏరియాకు గుండెకాయలాంటి జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలోనే తాగునీటి సమస్య తలెత్తడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో హంగు ఆర్భాటాలతో కొత్తగా ప్రారంభించిన ఈ కార్యాలయంలో కనీస అవసరమైన మంచినీళ్లు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాత జీఎం కార్యాలయంలో ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌తో పాటు చల్లని నీటి సౌకర్యం ఉండేది. అయితే కొత్త కార్యాలయంలో అలాంటి సౌకర్యాలు లేకపోవడంతో త్రాగునీటి అవసరాల కోసం ఉద్యోగులు త్రీ ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో సింగరేణి వారు ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవికాలం తీవ్రత పెరిగిన నేపథ్యంలో తీసుకువచ్చే నీరు కూడా సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా పలుమార్లు దూరం వెళ్లి నీళ్లు తీసుకురావడం చాలా కష్టంగా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాత కార్యాలయంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను కొత్త జీఎం కార్యాలయానికి తరలించి ఏర్పాటు చేస్తే సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు సూచిస్తున్నారు.
కార్యాలయాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న యాజమాన్యం వాష్‌రూమ్‌లలో నీటి సరఫరాపై మాత్రం సరైన దృష్టి పెట్టలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాష్‌రూమ్‌లలో నీరు అందుబాటులో లేక మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, సందర్శకుల సంఖ్యను అంచనా వేయకుండా తక్కువ సామర్థ్యం గల వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్యాంకులకు తోడు మరిన్ని వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి, నిరంతర నీటి సరఫరా కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.