చుంచుపల్లి, ఏప్రిల్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్‌బాద్ పంచాయతీ మాయాబజార్ గ్రామవాసులు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ మాయాబజార్ గ్రామానికి ధన్‌బాద్ నుండి మంచినీటి ట్యాంక్ ద్వారా నీరు సరఫరా అవుతుందని తెలిపారు. అయితే ఇటీవల పంప్ ఆపరేటర్ చనిపోవడం, కొత్త ఆపరేటర్‌ను నియమించక పోవడంతో ఎవరుపడితే వారు పంపునకు సంబంధించిన నీళ్లు నింపుకు వెళ్తున్నట్లు చెప్పారు. దీంతో మాయాబజార్ గ్రామానికి నీరు సరఫరా జరగడం లేదని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు, పంచాయతీ సెక్రటరీ స్పందించి కొత్త ఆపరేటర్‌ను నియమించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.