భద్రాచలం, ఏప్రిల్, 11 : వరంగల్లోఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భద్రాచలం నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులంతా దండుకట్టాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీ పాతికేళ్ల సభ కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ ఇన్చార్జి మానె రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం స్థానిక రెడ్డి సత్రంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్ సభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఏప్రిల్ 27 గులాబీ పార్టీ పండుగ రోజన్నారు. ఆ రోజు గ్రామ గ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని తెలిపారు. మీరంతా కష్టపడి గెలిపిస్తే ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని, పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారు. అయినా బాధ లేదు. రేపో మాపో మళ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమవుతోందన్నారు. హామీల అమలు దగ్గర నుంచి, పాలనా పరమైన నిర్ణయాల వరకు అభాసుపాలవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. వరంగల్ సభ దిగ్విజయానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు రాంబాబు, నర్సింహ మూర్తి, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, కృష్ణారెడ్డి, కణితి రాముడు, బోదెబోయిన బుచ్చయ్య, రేసు లక్ష్మీ, సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు.
Bhadrachalam : వరంగల్ సభకు దండుకట్టండి.. పాతికేళ్ల పార్టీ సభ దద్దరిల్లాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర