– దుమ్ముగూడెం మండల కార్యాలయం వద్ద భారీగా బారులు
దుమ్ముగూడెం, ఆగస్టు 31 : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్ )లో భాగంగా జారీ చేసిన నోటీసులు దుమ్ముగూడెం మండల ఓటర్లకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్థానిక పంచాయతీల్లో సవరణ ప్రక్రియకు సంబంధించిన యాప్ పనిచేయక పోవడంతో మండలంలోని 37 పంచాయతీలకు చెందిన ఓటర్లు సోమవారం ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో కార్యాలయ ప్రాంగణం ఓటర్లతో కిక్కిరిసిపోయింది. నోటీసులు చేతబట్టి వచ్చిన ఓటర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలిరావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు వాటిని తీసుకుని మండల కార్యాలయానికి చేరుకోగా అధికారులు యాప్ లో వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టారు.
ఒకేసారి అన్ని పంచాయతీల నుంచి ఓటర్లు రావడంతో కార్యాలయం వద్ద రద్దీ నెలకొంది. మండలంలోని ఆయా పంచాయతీల్లోనే ఓటర్ల సవరణ ప్రక్రియను నిర్వహించి ఉంటే ఇంత దూరం వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదని పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలను వెంటబెట్టుకుని వచ్చిన మహిళలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. మానుగట్టు గ్రామానికి చెందిన మడివి ఇడమయ్య, పాలమ్మలు తమ రెండు నెలల పాపను వెంటబెట్టుకుని మండల కార్యాలయానికి వచ్చారు. చిన్నారితో గంటల తరబడి క్యూలో నిలబడటం ఇబ్బందిగా మారిందని వారు వాపోయారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా మండలంలోని పలు పంచాయతీల్లో ఫోన్ సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో యాప్ ద్వారా ప్రక్రియ నిర్వహించడం సాధ్యం కావడం లేదని, అందుకే మండల కేంద్రంలో సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు.

గ్రామాల్లో యాప్ పనిచేయక ఓటర్లకు తిప్పలు!