రామవరం, డిసెంబర్ 05 : సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో వోల్వో ప్రమాదం జరిగింది. ఓవర్ బర్డెన్ (మట్టి తొలగింపు) డంప్ చేయడానికి వెళ్తుండగా డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. క్వారీలో రహదారి వెడల్పు తక్కువగా ఉండడం వల్ల ప్రమాదం జరిగినట్లు కార్మికులు తెలిపారు. క్వారీలో రహదారి వెడల్పు ఉండాల్సిన దానికంటే తక్కువుగా ఉండడం వల్ల తరచూ జరుగుతున్న ప్రమాదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. గతంలో అదేచోట ఓబి డంప్ చేస్తుండగావోల్వో పల్టికొట్టిన సంఘటన జరగకముందే మరొక సంఘటన చోటుచేసుకుంది. పూర్తిస్థాయిలో భద్రత ప్రమాణాలు పాటించక పోవడంతోనే ఇలా వరుస ప్రమాదాలు సంభవిస్తున్నట్లు, ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా కార్మికులు కోరుతున్నారు. ప్రమాద విషయమై వెంకటేష్ ఖని మేనేజర్ మురళిని వివరణ కోరగా.. ఏసీ వోల్వా క్యాబిన్ కారణంగా అప్పటికే టిఫిన్ చేసి ఉండడంతో కన్ను అంటుకున్నదని, దీంతో ప్రమాదం చోటుచేసుకుందని డ్రైవర్ రాత పూర్వకంగా రాసి ఇచ్చినట్లు చెప్పడం కొసమెరుపు.
సింగరేణి సంస్థ భద్రత ప్రమాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. కానీ సౌదా కంపెనీ విషయంలో మాత్రం కొంచెం వెసులుబాటు కల్పిస్తున్నారేమో అనే అనుమాలను వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ విధులు నిర్వహించే డ్రైవర్లు తప్పనిసరిగా ఎంవీటిసిలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సింగరేణి ప్రధాని ఆస్పత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించి అక్కడ అన్ని సక్రమంగా ఉంటే డ్యూటీకి ఫిట్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఓబీ పనులను నిర్వహిస్తున్న సంస్థ మాత్రం ఇవేం పట్టించుకోకుండా, నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో ఏదో నామమాత్రపు పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి సమర్పిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు భద్రతా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో జరిగే ప్రమాదాలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.