– ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్
రుద్రంపూర్, మే 16 : వీకే ఏరియా వర్క్ షాప్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పిట్ కార్యదర్శి మధుకృష్ణ అధ్యక్షతన వర్క్ షాప్‌లో పర్యటించిన ఆయన కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన మల్లికార్జున్ అనంతరం సంబంధిత అధికారి డీజీఎం క్రిస్టోఫర్‌ను కలిసి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా వర్క్ షాప్ కార్మికులకు ప్లే డేస్, పీహెచ్‌డీలు మంజూరు చేయాలని, వర్క్ షాప్‌లో మ్యాన్‌పవర్‌ను పెంచాలని, అధిక బరువులు ఎత్తేందుకు ఫోర్క్ లిఫ్టర్ వాహనాలు అలాగే ఈఓటీ యంత్రాలను త్వరితగతిన సమకూర్చాలని కోరారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాలకు సంబంధించిన బ్రేక్‌డౌన్, మరమ్మతు పనులను ఏరియా వర్క్ షాప్ కార్మికులు సకాలంలో పూర్తి చేస్తూ కీలక సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ, వారి సేవలను గుర్తించి ప్లే డేస్, పీహెచ్‌డీలు తప్పనిసరిగా ఇవ్వాలని డీజీఎంకు తెలిపారు. సమస్యలపై స్పందించిన డీజీఎం క్రిస్టోఫర్ కార్మికుల ప్లే డేస్, పీహెచ్‌డీల అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బేరర్ గుమ్మడి వీరయ్య, పిట్ కమిటీ సభ్యులు కరుణాకర్, మెంగని రోషన్, వర్క్ షాప్ కార్మికులు పాల్గొన్నారు.

‘వీకే వర్క్ షాప్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి’