– కార్మికుల రక్షణను గాలికి వదిలేసిన కంపెనీ
– ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు
రామవరం, నవంబర్ 13 : సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖనిలో బుధవారం మొదటి షిఫ్ట్ లో కాలం చెల్లిన, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పోత లోడర్ పై గంప.అచ్చయ్య అనే డ్రైవర్ లోడ్‌తో వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దాంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలపాలైన కాంట్రాక్ట్ కార్మికుడికి యాక్సిడెంట్ రిపోర్ట్ రాయకుండా, సింగరేణి ఆస్పత్రిలో వైద్యం అందించకుండా ప్రవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించడంతో సౌధ కంపెనీపై తీవ్రస్థాయిలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు మండిపడ్డారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని కనీస రక్షణ సూత్రాలు పాటించకుండా ఉత్పత్తే ధ్యేయంగా కార్మికుల ప్రాణాలతో సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ చెలగాటం ఆడుతుందన్నారు, వీకే కోల్ మైన్ ఆఫ్ లోడింగ్ క్వారీలో అదుపుతప్పి బోల్తాపడిన లోడర్ నెంబర్-11 కాలం చెల్లిన పాతది అని, ఆ లోడర్ కి ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదన్నారు. కనీసం నంబర్ ప్లేట్ కూడా లేదని తెలిపారు. సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికుడు విధులు నిర్వహించాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని సైతం బేఖాతరు చేస్తూ సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ సదరు కాంట్రాక్టర్ నడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి ఆస్పత్రి నుండి మెడికల్ ఫీట్ సర్టిఫికెట్, అలాగే సింగరేణి వీటిసి నందు శిక్షణ పొంది అర్హత కలిగిన సర్టిఫికెట్ పొంది క్వారీలో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కానీ అవేవి లేకుండా రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ నడిపిస్తుందన్నారు. అదేవిధంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కాంట్రాక్ట్ కార్మికుడు అచ్చయ్యకి క్వారీలో విధులు నిర్వహించడానికి ఎలాంటి అర్హత కలిగిన సర్టిఫికెట్స్ లేదని, అందుకే ప్రవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా డిజిఎంఎస్ స్థాయి అధికారి జరిగిన ప్రమాదంపై, అలాగే కార్మిక చట్టాలకు తూట్లుపొడుస్తున్న ఇలాంటి సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీపై విచారణ జరిపి చర్యలు తీసుకుని కార్మికుల ప్రాణాలను కాపాడాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.