– దర్గాలో హిందూ దేవాలయాలు
– దర్గా మాలిక్‌గా హిందూ
– దర్గాలో ప్రతి ఏడాది శ్రీరామ నవమి వేడుకలు, ఘనంగా రాముని పట్టాభిషేకం
ఇల్లెందు, నవంబర్ 15 : మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు. ఆహ్వాదకరమైన ప్రకృతి, ప్రశాంత వాతావరణంలో కొలువై నిజాం కాలం నుండి పేరు ప్రఖ్యాతి చెందిన పురాతన బొగ్గుటకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసిన నాగుల్ మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 1972లో కమిటీ ఏర్పడ్డ నాటి నుండి కార్తీక మాసం పౌర్ణమి నాడు ఇల్లందు దో నంబర్ బస్తీలో ఉన్న హజరత్ ఖాసిం దుల్హ దర్గాహ్ వద్ద ఉర్సు ఉత్సవాలు ప్రారంభమై 15 రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయి. ఉర్సు ఉత్సవాల్లో చివరి రెండు రోజులు అతి ముఖ్యమైన ఘట్టంగా ప్రసిద్ధి చెందాయి. ఇల్లందు దో నంబర్ బస్తీ నుండి గంధకంతో ప్రారంభమయ్యే ర్యాలీ సత్యనారాయణపురం దర్గా వరకు కేరళ వాయిద్యాలు, నాగపూర్ ఖవ్వాలి గానాలతో, వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, గుర్రపు భగ్గీల మీద ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీ ఎత్తున ఈ వేడుకలకు తరలివస్తారు. వారి మొక్కులను తీర్చుకుని నాగుల్ మీరా దీవెనలు పొంది సంతోషంగా తిరిగి వెళ్తారు.
చాలా సంవత్సరాల నుండి ఈ దర్గా ఉర్సు ఉత్సవాల్లో దర్గా మాలిక్ గా ఓ హిందూ ఉండడం మత సామరస్యానికి నిదర్శనం. దర్గా కమిటీ సభ్యులతో పాటు భక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి దర్గా ఆవరణలో పనులు నిర్వహించి, ప్రశాంత వాతావరణంలో కాసేపు దర్గాలో గడిపిపోతారు. కుల మతాలకు అతితంగా అన్ని మతస్తులు వచ్చి దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు.

Yellandu : కుల మతాలకు అతీతంగా నాగుల్ మీరా దర్గా ఉర్సు ఉత్సవాలు
దర్గాలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం రాముని పట్టాభిషేక కార్యక్రమం రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇదే కాకుండా దర్గా కమిటీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం రామాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అని చాటుతూ దర్గాను టూరిజం విద్యార్థులు సందర్శిస్తారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మత సామరస్యంపై అవగాహన కల్పిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు ఇల్లందు దో నంబర్ బస్తీలో గల హాజరత్ ఖాసీం దుల్హ దర్గాహ్ వద్ద ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది మొదలుకుని 14 రోజుల పాటు నాగుల్ మీరా దర్గా వద్ద ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ సంవత్సరం ఈ నెల 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు దో నంబర్ బస్తీ హజరత్ ఖాసీం దుల్హ దర్గాహ్ నుంచి ప్రారంభమయ్యే దర్గా ఉత్సవాలు 20వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఖవ్వాలి కార్యక్రమంతో ముగుస్తాయి.
అనునిత్యం రకరకాల సమస్యలతో వ్యాపారంలో, నిత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతున్న తరుణంలో ప్రతి శుక్రవారం దర్గాకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు, ఒక గంట సేపు అక్కడే ఉంటే మనసు ప్రశాంతత పడుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. చాలా సంవత్సరాల నుండి తాను దర్గాకు వెళ్తూ ఉర్సు ఉత్సవాల్లో భాగస్వామి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Yellandu : కుల మతాలకు అతీతంగా నాగుల్ మీరా దర్గా ఉర్సు ఉత్సవాలు