– డీఏఓ బాబురావు
ఇల్లెందు, జనవరి 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి నుండి యూరియాని రైతులకు యాప్ ద్వారానే అమ్మాలని డీఏఓ బాబురావు అన్నారు. శనివారం ఇల్లెందు పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను స్థానిక ఏఓ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల దుకాణం డీలర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతులకు యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతూ నేటి నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ముందుగానే యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని యూరియా తీసుకెళ్లాలని సూచించారు.
మొబైల్ ఫోన్ లేనివారు ఎవరి మొబైల్ నుండైనా యాప్ లో బుకింగ్ చేసుకున్నా యూరియా తీసుకెళ్లవచ్చు అని తెలిపారు, ఎవరైనా బుక్ చేసిన 24 గంటల్లో యూరియాను తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు దీనివల్ల సమయం ఆదా అవుతుందన్నారు. సకాలంలో ఎరువులు తెచ్చుకుని పంటలకు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులు యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈఓలు, ఎరువుల షాపు డీలర్లు, రైతులు పాల్గొన్నారు.