జూలూరుపాడు, మే 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం ఆవిష్కరించారు. ముందుగా ఉమా లింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయస్వామి కృపా కటాక్షాలు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు లేళ్ల వెంకట్రెడ్డి, జూలూరుపాడు మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ మధు, నాయకులు రోకటి సురేశ్, రామిశెట్టి రాంబాబు, గ్రామీణ వైద్యులు పూసాల శ్రీనివాసచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Julurupadu : పాపకొల్లులో పంచముఖ ఆంజనేయ విగ్రహావిష్కరణ