బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. అంగన్వాడీ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ముందుభాగంలో రోడ్డుపైకి మురుగునీరు చేరి అపరిశుభ్రతను తలపిస్తోంది. అంగన్వాడీ కేంద్రంలోకి చిన్నారులు వెళ్లాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వ్యాధుల కాలం కావడంతో పిల్లలకు ఏమైనా అంటువ్యాధులు ప్రబలితే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క పోషణ మాసోత్సవాలు జరుగుతున్నా ఈ అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులకు, ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు ఇది కనబడడం లేదా అని పలువురు ఆ శాఖ పనితీరుపై మండిపడుతున్నారు. అధికారులు స్పందించి పిచ్చిచెట్లను తొలగించి శుభ్రం చేయాలని, మురుగునీరు రోడ్డుపై పారకుండా చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.