బూర్గంపహాడ్, మే 28 : కేరళ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అపవిత్ర కలయిక బహిర్గతమైందని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేతల ఇళ్లలో ఈడీ సోదాల నేపధ్యంలో సీపీఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం మండల పరిధిలోని సారపాకలో సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ.. సీపీఎం కుటుంబాలు 10 ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి అల్లకల్లోలం సృష్టించాయని, దీనికి ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు.
కేంద్రంలో బీజేపీకి ఎదురొడ్డి పోరాడేది సీపీఎం మాత్రమేనని, సీపీఎంను దేశంలో లేకుండా చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి సీపీఎం కుటుంబాలపై దాడులకు దిగుతున్నట్లు, ఈ చర్యలు దారుణమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం నేతల ఇళ్లపై దాడులకు దిగుతున్నారని, రానున్న కాలంలో ప్రజలే కేంద్రంలోని బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజిని, ఎస్.అబిద, కవులూరి నాగమణి, పాషా, హుస్సేన్, రాంబాబు పాల్గొన్నారు.